
ముంబై : గుజరాతీలు, రాజస్థానీలను పొగుడుతూ చేసిన కామెంట్లపై దుమారం రేగడంతో మహారాష్ట్ర గవర్నర్ కోష్యారీ సారీ చెప్పారు. ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని సోమవారం క్లారిటీ ఇచ్చారు. మరాఠీ మాట్లాడే ప్రజలను, ముంబైకర్లను తానెప్పుడూ తక్కువచేసి చూడలేదని స్పష్టం చేశారు. ఈమేరకు గవర్నర్ కోష్యారీ సోమవారం మరాఠీలో ట్వీట్ చేశారు. ముంబైలో గత వారం జరిగిన ఓ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడారు. ‘గుజరాతీలు, రాజస్థానీలను పంపించేస్తే ముంబైలో డబ్బులు ఉండవు’ అని కామెంట్ చేశారు. దీనిపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. మరాఠాలను కించపరిచినందుకు గవర్నర్ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశాయి. తన మాటలకు తప్పుడు అర్థాలు తీయొద్దని, రాజకీయం చేయొద్దని కోష్యారీ అదేరోజు లీడర్లకు విజ్ఞప్తి చేశారు. అయినా గొడవ సద్దుమణగకపోవడంతో తాజాగా ‘సారీ’ చెబుతూ గవర్నర్ కోష్యారీ ట్వీట్ చేశారు.