ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం..శాంతి మార్గం ద్వారానే విశ్వగురువుగా భారత్: గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా 

ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం..శాంతి మార్గం ద్వారానే విశ్వగురువుగా భారత్: గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా 

హైదరాబాద్, వెలుగు: శాంతి మార్గం ద్వారానే భారత్ విశ్వ గురువుగా ఎదుగుతున్నదని గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా శాంతి వనంలో గురు తేజ్ బహదూర్ 350వ వర్ధంతి, రామచంద్ర మిషన్ వ్యవస్థాపకుడు బాబూజీ మహరాజ్ 127వ జయంతి, రాష్ట్ర సంత్ తుక్డోజీ మహరాజ్ 117వ జయంతి వేడుకలు గురువారం జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మిత్ సింగ్, కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, హార్ట్‌‌ఫుల్‌‌నెస్ గైడ్ దాజీ పాల్గొన్నారు.

గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్ల మాట్లాడుతూ.. తెలంగాణలో ఇంతటి ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సృష్టించిన రామచంద్ర మిషన్ ప్రతినిధులను అభినందించారు. అనంతరం అతిథులందరూ పంజాబ్, ఝార్ఖండ్ నుంచి వచ్చిన అభ్యాసకులతో కలిసి మెడిటేషన్ హాల్‌‌లో ధ్యానం చేశారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ గురు తేజ్ బహదూర్ మత స్వేచ్ఛ, మానవ హక్కుల కోసం తన ప్రాణాలను అర్పించిన వీరుడు అని కొనియాడారు.

అలాగే బాబూజీ మహారాజ్ క్లిష్టమైన యోగాను సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారని, ఆయన చూపిన మార్గంతో తెలంగాణ నేడు అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా మారిందని ప్రశంసించారు. కన్హా శాంతి వనం పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. విదేశీ ప్రతినిధులు రామప్ప దేవాలయం, గోల్కొండ కోట, చారిత్రక కట్టడాలను సందర్శించాలని మంత్రి కోరారు.