నిర్బంధం నుంచి స్వేచ్ఛ : గవర్నర్ తమిళిసై

నిర్బంధం నుంచి స్వేచ్ఛ : గవర్నర్ తమిళిసై
  • నిర్బంధం నుంచి స్వేచ్ఛ 
  • నియంతృత్వ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి
  • ప్రజలకు, పాలకులకు మధ్య ఇనుప కంచెలు తొలగినయ్: గవర్నర్
  • గత పాలకుల నిర్వాకంతో అప్పుల కుప్పలా రాష్ట్రం
  • వేల కోట్ల అప్పుల్లో విద్యుత్​ సంస్థలు
  • గాడితప్పిన ఆర్థిక వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్
  • త్వరలో శాఖల వారీగా శ్వేతపత్రాలు
  • ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ.. ఆరు నెలల్లో మెగా డీఎస్సీ 
  • వ్యవసాయానికి 24 గంటల కరెంట్.. ప్రతి పంటకూ మద్దతు ధర
  • అసెంబ్లీ, మండలిని ఉద్దేశించి తమిళిసై ప్రసంగం

హైదరాబాద్, వెలుగు : నియంతృత్వ పాలన నుంచి రాష్ట్రం విముక్తి పొందిందని గవర్నర్ తమిళిసై అన్నారు. తెలంగాణ ఇప్పుడు స్వేచ్ఛా వాయువులను పీల్చు కుంటున్నదని చెప్పారు. పదేండ్ల నిర్బంధపు పాలన నుంచి విముక్తి కావాలని, తమ బతుకుల్లో మార్పు రావాలని ప్రజలు ఇటీవలి ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారని తెలిపారు. ప్రజలకు, పాలకులకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలగిపోయాయని, ప్రజాప్రస్థానం మొదలైందని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీ, మండలిని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. అంతకుముందు అసెంబ్లీకి వచ్చిన తమిళిసైకి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్వాగతం పలికారు. తర్వాత చైర్మన్, స్పీకర్ కలిసి గవర్నర్‌‌ను స్పీకర్ వేదిక వద్దకు తీసుకువెళ్లారు. 

ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం విచ్చలవిడిగా రుణాలు తెచ్చి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారని, ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదని చెప్పారు. ‘‘గత ప్రభుత్వ నిర్వాకంతో విద్యుత్ వ్యవస్థలు రూ. 81,516 కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయి.  మరో50,275 కోట్ల మేర నష్టాల్లో ఉన్నాయి. పౌర సరఫరాల కార్పొరేషన్ అప్పులు56 వేల కోట్లకు, నష్టాలు11 వేల కోట్లకు చేరాయి” అని తెలిపారు.

ప్రజలపై భారం మోపకుండానే సంక్షేమ పాలన అందించాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమని వెల్లడించారు. ‘‘ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజలకు సేవకులే తప్పా.. పెత్తందార్లు కాదని సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించే సమయంలో చెప్పారు. దానికి అనుగుణంగా ప్రజావాణి కార్యక్రమం మొదలైంది. యువకుల ప్రాణత్యాగాలు, విద్యార్థుల పోరాటాలు, నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్షలతో రాష్ట్రం ఏర్పడింది. అమరుల ఆశయాలు, విద్యార్థుల పోరాటాలు, పౌర సమాజపు ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని పాలన సాగించాలన్నది సర్కారు ఉద్దేశం. ప్రజాసంక్షేమం కోసం ఆరు గ్యారంటీలను ఎన్నికల సమయంలో ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పడగానే దానికి చట్టబద్ధత కల్పించే ఫైలుపై సీఎం తొలి సంతకం చేశారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాం’’ అని గవర్నర్ తెలిపారు.

ఆరు గ్యారంటీలైన మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత పథకాలను వచ్చే వంద రోజుల్లో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ మొదలైందని చెప్పారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అందులో భాగంగానే రూ.10 లక్షల వరకూ ఉచిత వైద్యం పొందేలా రాజీవ్ ఆరోగ్యశ్రీ  స్కీమ్ ప్రారంభించామని తెలిపారు. సాధ్యమైనంత త్వరలో అమరవీరుల కుటుంబాలను గుర్తించి వారికి 250 గజాల స్థలాన్ని, గౌరవ భృతిని అందిస్తామని చెప్పారు.

కాళేశ్వరం అవినీతిపై విచారణ జరిపిస్తం

వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన, నిరంతర విద్యుత్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ తమిళిసై చెప్పారు. ప్రతి పంటకూ మద్దతు ధర కల్పిస్తామని చెప్పారు. రూ.2 లక్షల రుణమాఫీపైనా త్వరలోనే కార్యాచరణ ఉంటుందని ప్రకటించారు. అసైన్డ్, పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో నాణ్యత లోపం, అవినీతిపై విచారణ జరిపిస్తామని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించాలన్నది తమ సంకల్పమని తెలిపారు. మెగా డీఎస్సీ నిర్వహించి వచ్చే ఆరు నెలల్లో టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని తమిళిసై ప్రకటించారు.

టీఎస్​పీఎస్సీ ప్రక్షాళనపై సర్కారు కార్యాచరణ మొదలుపెట్టిందని తెలిపారు. ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ద్వారా ఇంటి స్థలం ఉన్న వారికి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం అందిస్తామని.. ఎస్సీ, ఎస్టీలకు మరో రూ.లక్ష అదనంగా ఇస్తామని వెల్లడించారు. ధరణి పోర్టల్ స్థానంలో సమగ్ర భూ సమస్యల పరిష్కారం కోసం ‘భూమాత’ పేరుతో పోర్టల్ తీసుకొస్తామన్నారు. ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేసి సర్కారు భూములను పరిరక్షిస్తామని తెలిపారు. తెలంగాణలో డ్రగ్స్, మత్తు పదార్థం అనే మాట వినపడకుండా చర్యలు తీసుకుంటామని, ఎంతటి ఒత్తిళ్లు వచ్చినా డ్రగ్స్ విషయంలో దోషులను వదిలేది లేదన్నారు.

మూడు జోన్లుగా హైదరాబాద్

మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని, మూసీ పరీవాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పనా జోన్‌గా మార్చే కార్యాచరణ మొదలుపెట్టామని గవర్నర్ చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని మూడు జోన్లుగా విభజించాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న హైదరాబాద్ నగరం, ఔటర్ రింగ్ రోడ్ – ప్రాతిపాదిత రీజినల్ రింగ్ రోడ్ మధ్య ఉన్న ప్రాంతం, ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్ బయట ఉన్న ఏరియా.. ఇలా మూడు జోన్లు విభజించి, అందుకు తగ్గట్టుగా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలనే ఆలోచన ఉందని పేర్కొన్నారు.

ప్రతిపక్షాల నుంచి నిర్మాణాత్మక సూచనలు తీసుకుంటామని, అభివృద్ధి విషయంలో వివక్ష ఉండబోదని చెప్పారు. ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా సరే ప్రభుత్వం నుంచి తమ నియోజకవర్గానికి అవసరమైన సహాయ సహకారాలు పొందవచ్చని తెలిపారు. సెక్రటేరియెట్ ఇకపై అలంకార ప్రాయంగా ఉండబోదన్నారు. గ్రామాన్ని ఓ యూని ట్‌గా భావించి, అందుకు తగినట్లుగా ప్లాన్లు వేసి అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. స్థానిక ప్రజాప్రతినిధులకూ ప్రభుత్వంలో గౌరవం దక్కుతుందని స్పష్టం చేశారు.

గాడితప్పిన ఆర్థిక వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. త్వరలోనే శాఖల వారీగా శ్వేతపత్రాలు రిలీజ్ చేసి వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచుతాం. ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో ఎక్కడెక్కడ లోపాలున్నాయో, ఎక్కడ దుబారా జరిగిందో, ఎక్కడెక్కడ దుర్వినియోగం జరిగిందో కనిపెట్టే పనిలో ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో నాణ్యతా లోపాలు, అవినీతిపై విచారణ జరిపిస్తాం. ధరణి పోర్టల్ స్థానంలో సమగ్ర భూ సమస్యల పరిష్కారం కోసం ‘భూమాత’ పేరుతో పోర్టల్ తీసుకొస్తం. ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేసి సర్కారు భూములను పరిరక్షిస్తం.

- గవర్నర్ తమిళిసై