బిల్లులు ఉద్దేశపూర్వకంగా వెనక్కి పంపలేదు..: గవర్నర్ తమిళిసై

 బిల్లులు ఉద్దేశపూర్వకంగా వెనక్కి పంపలేదు..: గవర్నర్ తమిళిసై

అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లులను తాను ఉద్దేశపూర్వకంగా వెనక్కి పంపలేదని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ఆగస్టు 1న ఆమె రాజ్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. వరద ప్రాంతాల్లో తానే స్వయంగా పర్యటించనున్నట్లు చెప్పారు. 

అనంతరం రెడ్ క్రాస్ రిపోర్ట్ తయారు చేసి కేంద్రానికి పంపనున్నట్లు వెల్లడించారు. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని.. బద్నాం చేయాలని చూస్తే తాను బాధ్యురాలిని కానని ఆమె స్పష్టం చేశారు. బిల్లులు వెనక్కి పంపడానికి గల కారణాలు చెప్పానని వెల్లడించారు. 

వరదలతో అపార నష్టం..

తెలంగాణలో ఇటీవల కురుసిన వర్షాలతో చాలా జిల్లాలు నష్టపోయాయని గవర్నర్ అన్నారు. పలు చోట్ల ఇళ్లు డ్యామేజీ అయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి అనేక పార్టీల నేతలు తనకు వినతి పత్రాలు ఇచ్చారని వాటిని ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. జల్ పల్లి మున్సిపాలిటీ ఇంకా నీళ్లలోనే ఉందని అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ప్రజలను కాపాడటానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

మహిళలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి..

మహిళలు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని తమిళిసై సూచించారు. రాజ్ భవన్ లో ఫౌండేషన్ ఫర్ ఫ్యూటురిస్టిక్ సిటీస్ నిర్వహిస్తున్న ఉమెన్ హెల్త్ పై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న గవర్నర్ మాట్లాడుతూ.. మహిళలు పోషకాహారం తీసుకోవాలని సూచించారు. 

తాను ఆరు గిరిజన గ్రామాలు దత్తత తీసుకున్నానని.. గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం న్యూట్రిషియన్ కిట్లను సైతం ముందే ఇవ్వాలని కోరారు. ఐటీ రంగంలో పని చేస్తున్న వనితలకు ఎక్కువగా గైనిక్ సమస్యలు వస్తున్నాయని అన్నారు. 

కరెన్సీ లెక్క పెడుతున్నారని క్యాలరీలు లెక్కపెట్టట్లేదని చమత్కరించారు. మహిళ ఆరోగ్యంపై డాక్టర్లతో మీటింగ్ జరిపామని.. నివేదిక తయారు చేసి దాన్ని కేంద్రానికి పంపుతామ ని అన్నారు.