
కరీంనగర్: మాజీ ఎమ్మెల్యే, సీనియర్ అడ్వొకేట్ బొమ్మ వెంకటేశ్వర్లు అకాల మృతిపై మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బొమ్మ వెంకటేశ్వర్లు కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబసభ్యులకు సంతాప సందేశం పంపించారు విద్యాసాగర్ రావు.
సీహెచ్ విద్యాసాగర్ రావు కరీంనగర్ కు చెందిన బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది కావడంతో.. ఆయనకు కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బొమ్మ వెంకన్నతో సాన్నిహిత్యం ఉండేది. దీనిని తన సంతాప సందేశంలో తెలియజేశారు గవర్నర్. కరీంనగర్ కు చెందిన బొమ్మ వెంకటేశ్వర్లు ప్రఖ్యాత న్యాయవాదిగా పేరుతెచ్చుకున్నారని ప్రశంసించారు. కరీంనగర్ బార్(న్యాయవాదుల సంఘం) లో తాము ఇద్దరం సభ్యులుగా ఉండేవాళ్లమన్నారు. రాజకీయ వైరుధ్యాలు ఉన్నప్పటికీ తాము ఇద్దరం మంచి స్నేహితుల్లాగా ఉంటూ వచ్చామన్నారు. కరీంనగర్ ఓ మంచి న్యాయవాదిని, మంచి మనిషిని కోల్పోయిందని చెప్పారు. బొమ్మ వెంకన్న మృతి కారణంగా.. ఆయన కుటుంబానికి హృదయపూర్వక సంతాపాన్ని ప్రకటిస్తున్నానని తన సందేశంలో వివరించారు సీహెచ్ విద్యాసాగర్ రావు.