
హైదరాబాద్/సిద్దిపేట, వెలుగు : గవర్నర్ పక్షపాత వైఖరిని అవంలబిస్తున్నారని, దీనిని ప్రజలు గమనిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన దాసోజు శ్రవణ్, ఎరుకల కులానికి చెందిన సత్యనారాయణను గవర్నర్ కోటాలో బీఆర్ఎస్ప్రభుత్వం నామినేట్ చేస్తే.. వారికి రాజకీయ సంబంధాలున్నాయని రిజెక్ట్ చేసిన గవర్నర్.. ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న ప్రొఫెసర్ కోదండరామ్పేరును ఎలా ఆమోదించారో సమాధానం చెప్పాలన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ జాతీయ జెండా ఎగురవేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. గవర్నర్ ప్రజలకు బాధ్యులే తప్ప సీఎంకు కాదన్న విషయం గుర్తించాలన్నారు. రేవంత్ రెడ్డి అహంకారం, వెకిలి వ్యవహారం చూస్తుంటే వాళ్లు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కనకపు సింహాసనమున శునకమును కూర్చుండ బెట్టినా.. నీచ మానవులు బుద్ధి మారరని పెద్దలు ఎప్పుడో చెప్పారన్నారు.
కాగా, తెలంగాణ భవన్లో రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి మహమూద్అలీ.. జెండా ఆవిష్కరణ అనంతరం కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే బీఆర్ఎస్ నాయకులు అతన్ని అపోలో హాస్పిటల్కు తరలించారు. అయితే, తాను బాగానే ఉన్నానని సాయంత్రం మహమూద్ అలీ వీడియో సందేశం రిలీజ్ చేశారు.
కాంగ్రెస్, బీజేపీ రహస్య మైత్రి బయటపడ్డది: హరీశ్
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంతో కాంగ్రెస్, బీజేపీ రహస్య మైత్రి మరోసారి బయట పడిందని మాజీ మంత్రి హరీశ్ రావు ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి మేలు చేసేలా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై బీఆర్ఎస్ను అణగదొక్కాలని చూస్తున్నాయని, ఈ కుట్రలో గవర్నర్ భాగస్వామి కావడం అత్యంత దురదృష్టకరమని హరీశ్ మండిపడ్డారు. హామీలు అమలు చేయమని అడిగితే మంత్రులు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. గురువారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ సమావేశం అనంతరం ఎంపీలు నామా నాగేశ్వర రావు, రంజిత్ రెడ్డి, దయాకర్ తో కలిసి హరీశ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నేతల మాటలను చూస్తుంటే ఆరుగ్యారెంటీలపై దాటవేత ధోరణి కనిపిస్తోందన్నారు.