ఈ-రిక్షాలు, ఇతర ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) బ్యాటరీలను రిమోట్ ద్వారా స్విచాఫ్ చేయగల సామర్థ్యం ఉన్న 7 యాప్‌లను తొలగించాలని గూగుల్, యాపిల్ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
న్యూఢిల్లీ: ఈ–-రిక్షాలు, ఇతర ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) బ్యాటరీలను రిమోట్ ద్వారా బ్లాక్ చేయగల కెపాసిటీ ఉన్న 7 యాప్‌లను తొలగించాలని గూగుల్, యాపిల్ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దుర్వినియోగం, వాహన భద్రత, ఈవీ బ్యాటరీ సిస్టమ్స్‌లో అనధికారిక జోక్యంపై ఆందోళనలను ప్రస్తావిస్తూ కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్ స్టోర్ల నుంచి ఆ ఏడు అప్లికేషన్లను తొలగించాలని కోరుతూ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.
వాహనదారులకు తెలియకుండా వాహనాలను నిలిపివేయడానికి ఇటువంటి యాప్‌లను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నోటీసులపై గూగుల్, యాపిల్ సంస్థ నుంచి స్పందన రాలేదు. కాగా, చైనా కంపెనీ షెన్‌జెన్ గ్రీనెర్జీ టెక్నాలజీ అభివృద్ధి చేసిన ‘బ్యాట్-బీఎమ్ఎస్’ అప్లికేషన్‌లో ఇలా ఈవీల బ్యాటరీలను స్విచాఫ్ చేసే ఆప్షన్లు ఉన్నాయి.
బ్లూటూత్ సదుపాయం ఉన్న లిథియం బ్యాటరీలను పర్యవేక్షించడంలో వినియోగదారులకు సహాయపడటానికి రూపొందించిన ఈ యాప్.. బ్యాటరీ ఛార్జ్, వోల్టేజ్, కరెంట్, ఉష్ణోగ్రత, ఛార్జింగ్ సైకిల్స్, వ్యక్తిగత బ్యాటరీ సెల్స్ ఆరోగ్యం వంటి సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. భారతీయ ఈ-–రిక్షాలలో ఉపయోగించే కొన్ని తక్కువ -ధర లిథియం బ్యాటరీ ప్యాక్‌లు బలహీనమైన లేదా ఎటువంటి పాస్‌వర్డ్ రక్షణ లేని బ్లూటూత్ -ఆధారిత బీఎమ్ఎస్ యూనిట్లను కలిగి ఉన్నాయి.
దీంతో బ్లూటూత్ పరిధిలో సాధారణంగా 10 నుంచి 15 మీటర్ల దూరంలో నిలబడిన వ్యక్తి బ్యాటరీకి కనెక్ట్ అయి, దానిని నిలిపివేసే అవకాశం ఉంది. దీనివల్ల వాహనం మోటార్‌కు పవర్ కట్ అయి అది నిలిచిపోతుంది.
