ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న సైట్లను బ్లాక్​ చేసిన కేంద్రం

ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న సైట్లను బ్లాక్​ చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వెబ్​సైట్లపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వ్యవస్థీకృత అక్రమ పెట్టుబడులు, టాస్క్‌‌- ఆధారిత పార్ట్‌‌ టైం జాబ్‌‌ మోసాలు చేస్తున్న 100కు పైగా వెబ్​సైట్లను బుధవారం కేంద్ర ఐటీ శాఖ బ్లాక్‌‌ చేసింది. ఆన్‌‌లైన్‌‌ నేరాలపై కేంద్ర హోం శాఖకు చెందిన ఇండియన్‌‌ సైబర్‌‌ క్రైమ్‌‌ కోఆర్డినేషన్‌‌ సెంటర్‌‌(I4సీ) విభాగం ఇటీవల ఒక రివ్యూ చేసింది. ఆన్​లైన్​ మోసాలు జరుగుతున్న కొన్ని వెబ్‌‌సైట్లను గుర్తించి.. వాటిని తక్షణమే బ్లాక్‌‌ చేయాలని ఐటీ శాఖకు సిఫార్సు చేసింది. దీంతో ఐటీ శాఖ బుధవారం100కి పైగా వెబ్‌‌సైట్లపై నిషేధం విధిస్తూ ప్రకటన జారీ చేసింది.

ఆర్థిక నేరాలను ప్రోత్సహిస్తున్న ఈ వెబ్‌‌సైట్లను విదేశీ వ్యక్తులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఆర్థిక మోసాల నుంచి వచ్చిన సొమ్మును క్రిప్టో కరెన్సీలు, విదేశీ ఏటీఎం కార్డులు, ఇంటర్నేషనల్‌‌ ఫిన్‌‌టెక్‌‌ కంపెనీల సాయంతో మనీలాండరింగ్ చేస్తున్నట్లు గుర్తించామని ఐటీశాఖ పేర్కొంది. అయితే, ఈ వెబ్‌‌సైట్ల వివరాలను వెల్లడించలేదు. వర్క్​ ఫ్రమ్​ హోమ్ ​అనే ప్రకటనలతో సైబర్ ​నేరగాళ్లు యూజర్లను ఆకట్టుకుంటారని, ఆన్​లైన్ ​మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.