ఏపీలో అటవీ భూములపై గిరిజనులకు పట్టాలు

ఏపీలో అటవీ భూములపై గిరిజనులకు పట్టాలు
  • లక్షా 53 వేల మందికి 3.12 లక్షల ఎకరాలు పంపిణీ
  • పట్టాలు పంచే కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్
  • రైతు భరోసా కింద రూ.13,500 కూడా ఇస్తామని వెల్లడి

అమరావతి, వెలుగు: ఏపీలో జగన్ సర్కారు గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పించింది. దాదాపు లక్షన్నర మంది గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని షురూ చేసింది. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసులో పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ ప్రారంభించారు. రూ.500 కోట్లతో విశాఖపట్నం జిల్లా పాడేరులో గిరిజన మెడికల్ కాలేజ్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, విజయనగరం జిల్లా కురుపాంలో రూ.153 కోట్లతో గిరిజన ఇంజనీరింగ్ కాలేజ్ నిర్మాణానికి ఆన్ లైన్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. 1.53 లక్షల గిరిజన కుటుంబాలకు  3.12 లక్షల ఎకరాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. గాంధీ జయంతి రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా నిజమైన గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినట్టు తెలిపారు. గిరిజనులకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నెలరోజుల్లో  పూర్తి చేస్తామన్నారు. గిరిజనులకు హక్కుపత్రాలతోపోటు రైతు భరోసా కింద రూ.13,500 చొప్పున అందిస్తామని తెలిపారు. పట్టాలు పొందిన గిరిజనులకు ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

చప్పట్లతో అభినందనలు

గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థకు ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎం జగన్ అభినందనలు తెలిపారు. తాడేపల్లిలోని తన నివాసంలో శుక్రవారం రాత్రి 7 గంటలకు చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగానూ ఇట్ల చేశారు.