దుబాయ్ నుంచో లేక మరో విదేశం నుంచో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తక్కువ రేటుకు బంగారం తెప్పించేసుకుందాం అనుకునే గోల్డ్ లవర్స్ ముందుగా పరిమితుల గురించి తప్పక తెలుసుకోవాలి. బంగారం స్మగ్లింగ్, ట్యాక్స్ ఎగవేతలకు, ఇల్లీగల్ బిజినెస్‌లకు అడ్డుకట్ట వేయడమే టార్గెట్‌గా మోడీ సర్కార్ సరికొత్త రూల్స్ తీసుకొచ్చింది. విదేశాల నుంచి అడ్డదారుల్లో ఇండియాకు వచ్చే బంగారానికి బ్రేకులు వేస్తూ.. ఒక లైసెన్స్‌పై డ్యూటీ-ఫ్రీ గోల్డ్ ఇంపోర్ట్స్ పరిమితిని కేవలం 100 కేజీలకు మాత్రమే పరిమితం చేస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ సంచలన నిర్ణయం తీసుకుంది.
మే 13న పసిడిపై ఇంపోర్ట్ డ్యూటీ పెంచిన కేంద్రం, మే 14న ఏకంగా ఊహించని షాక్ ఇచ్చింది. బంగారం, వెండిపై ఇంపోర్ట్ టారిఫ్‌ను 6% నుండి 15% కి పెంచేసింది. దీనికి 5% అగ్రికల్చర్ సెస్, 3% ఐజీఎస్‌టీ అన్నీ కలిపితే మొత్తం పన్ను భారం 9.18% నుండి ఏకంగా 18.46% కి పెరిగిపోయింది. అంటే విదేశాల నుంచి అడ్డదారిలో తెచ్చే ప్రతి కన్సైన్‌మెంట్‌పై గతంలో కంటే రెట్టింపు.. అంటే దాదాపు 18% లాభం చూసుకునే ఛాన్స్ దొరికింది. ఈ అక్రమ మార్గాన్ని, లూప్‌హోల్స్‌ను పూర్తిగా క్లోజ్ చేయడానికే ప్రభుత్వం 100 కేజీల లిమిట్ పెట్టింది.
ప్రయాణికులకు ఎంత గోల్డ్ డ్యూటీ ఫ్రీ..?
విదేశాల నుంచి భారత్‌కు వచ్చే సాధారణ ప్రయాణికులు తమతో పాటు తెచ్చుకునే బంగారు ఆభరణాలపై కేంద్ర ప్రభుత్వం పరిమితులను విధించింది. ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం విదేశాల్లో నివసించిన పురుషులు 20 గ్రాముల వరకు (గరిష్టంగా రూ.50వేలు విలువైన), అలాగే మహిళలు 40 గ్రాముల వరకు (గరిష్టంగా రూ.లక్ష విలువైన) బంగారు ఆభరణాలను ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ లేకుండా ఉచితంగా దేశంలోకి తీసుకురావచ్చు. అయితే ఒకవేళ ప్రయాణికులు గోల్డ్ కాయిన్స్, బిస్కెట్లు తీసుకువస్తే మాత్రం వాటి బరువుతో సంబంధం లేకుండా కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆభరణాల విషయంలో పరిమితికి మించి అదనంగా బంగారాన్ని తీసుకువస్తే రూల్స్ ప్రకారం కస్టమ్స్ డ్యూటీ కట్టడం తప్పనిసరి.
వ్యాపారులకు కొత్త కష్టాలు..
అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ కింద పన్ను లేకుండా బంగారం దిగుమతి చేసుకోవాలంటే రూల్స్ చాలా స్ట్రిక్ట్ అయిపోయాయి. ఒకసారి 100 కేజీల కోటా వాడుకున్నాక.. మళ్లీ కొత్త లైసెన్స్ కావాలంటే పాత కోటాలో కనీసం 50% ఎగుమతి చేయాల్సిందే. అంటే పేపర్ల మీద వ్యాపారం చూపిస్తూ ఇండియాలో బంగారం మార్కెట్ చేసే కేటుగాళ్లకు ఇక చెక్ పడినట్లే. జెన్యూన్ జ్యువెలరీ ఎగుమతిదారులకు దీనివల్ల ఎలాంటి నష్టం ఉండదు. అక్రమంగా లాభాలు పొందాలనుకునే వారికి మాత్రం ఇది కోలుకోలేని దెబ్బ. అలాగే మొదటిసారి అప్లై చేసే వ్యాపారుల ఆఫీసులు, ఫ్యాక్టరీలను అధికారులు స్వయంగా ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఎంత బంగారం తెచ్చారు, ఎంత ఎగుమతి చేశారనే నివేదికను చార్టర్డ్ అకౌంటెంట్ సర్టిఫికేషన్‌తో సబ్మిట్ చేయాలి.
