ప్రభుత్వ లోన్ బీమా పథకం.. ఈ స్కీమ్ ప్రకారం.. లోన్ తీసుకున్న మహిళ చనిపోతే..

ప్రభుత్వ లోన్ బీమా పథకం.. ఈ స్కీమ్ ప్రకారం.. లోన్ తీసుకున్న మహిళ చనిపోతే..

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌‌హెచ్‌‌జీ) అభివృద్ధి, భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మహిళా సంఘాల సభ్యుల కోసం అమలు చేస్తున్న ప్రమాద బీమా, లోన్ బీమా పథకాల ద్వారా ఇప్పటివరకు ప్రభుత్వం మొత్తం రూ. 246 కోట్లు చెల్లించినట్లు ఆమె మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

గతంలో సంఘంలో సభ్యురాలిగా ఉన్న మహిళ చనిపోతే.. ఆమె తీసుకున్న అప్పు కట్టలేక ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఉండేదని మంత్రి గుర్తుచేశారు. ఆ అప్పు భారం గ్రూపులోని ఇతర సభ్యులపై పడటమే కాకుండా, సకాలంలో చెల్లించకపోతే బ్యాంకులు కూడా సంఘాలను బ్లాక్ లిస్ట్‌‌లో పెట్టేవన్నారు. దీనివల్ల అనేక సంఘాలు మూతపడ్డాయని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించేందుకే ప్రభుత్వం లోన్ బీమా పథకం తెచ్చిందని తెలిపారు. 

ఈ స్కీమ్ ప్రకారం.. లోన్ తీసుకున్న మహిళ చనిపోతే ఆమె బకాయి ఉన్న అప్పును గరిష్టంగా రూ. 2 లక్షల వరకు ప్రభుత్వమే నేరుగా బ్యాంకులకు చెల్లిస్తుందని మంత్రి వెల్లడించారు. ఇలా ఇప్పటివరకు 2,993 క్లెయిమ్స్ పరిష్కరించి, ప్రభుత్వం రూ. 223.7 కోట్లను బ్యాంకులకు కట్టి ఆయా కుటుంబాలను అప్పుల నుంచి గట్టెక్కించిందని వివరించారు. అలాగే..మహిళా సంఘం సభ్యురాలు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆమె కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా ప్రభుత్వం రూ. 10 లక్షల ప్రమాద బీమా అందిస్తోందన్నారు. 

2024 నుంచి ఇప్పటివరకు ప్రమాదాల్లో మరణించిన 231 మంది సభ్యుల కుటుంబాలకు రూ. 23.1 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందజేశామన్నారు. బీమా భరోసా ఉండటంతో మహిళలు ఇప్పుడు ధైర్యంగా తమ వ్యాపారాలను విస్తరించుకుంటున్నారని.. కొత్తగా అనేకమంది మహిళలు సంఘాల్లో చేరుతున్నారని మంత్రి సీతక్క పేర్కొన్నారు.