ఆగస్టులోపు రైతు రుణమాఫీ చేసి తీరుతాం : ఆది శ్రీనివాస్

ఆగస్టులోపు రైతు రుణమాఫీ చేసి తీరుతాం : ఆది శ్రీనివాస్
  •     హరీశ్ రావు.. రాజీనామా లేఖ సిద్ధం చేసుకో: ఆది శ్రీనివాస్ 

హైదరాబాద్, వెలుగు : ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేసి తీరుతామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు ఎన్నికల ముందు చేసిన చాలెంజ్​కు కట్టుబడి స్పీకర్ ఫార్మాట్ లో తన రాజీనామా లేఖను సిద్ధం చేసుకోవాలని ఆయన సవాల్​విసిరారు. ఈ అంశంపై పక్కకు పారిపోకుండా హరీశ్ మానసికంగా సిద్ధంగా ఉండాలన్నారు. సోమవారం సీఎల్పీ కార్యాలయంలో ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. హరీశ్ రావు ఇంకా తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

సీఎం రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమం కోసం పాటు పడే వ్యక్తి అని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ వెంచర్లు,కొండలు, గుట్టలకు కూడా రైతు బంధు ఇచ్చారని, కాంగ్రెస్  ప్రభుత్వం మాత్రం అలాంటి భూములకు ఇవ్వదని ఆయన వివరించారు. ఇప్పటి వరకు 68 మంది లక్షల మంది రైతులకు రూ.7 వేల 625 కోట్లు రైతుబంధు కింద వారి ఖాతాలో ప్రభుత్వం జమ చేసిందన్నారు.

2022 – -23 సంవత్సరంలో బీఆర్ఎస్ సర్కార్ రైతు బంధు ఇచ్చిన తేదీల కంటే ముందే కాంగ్రెస్  ప్రభుత్వం  రైతుల బ్యాంకు ఖాతాల్లో వేసిందన్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్టు తప్పదని హెచ్చరించారు.