బీఆర్ఎస్ హయాంలో జరిగిన పాపాలు ఒక్కోటి బయటపడుతున్నాయని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య విమర్శించారు. కేటీఆర్ తన సొంత బావ,చెల్లె ఫోన్లనే ట్యాప్ చేయించారని ఆరోపించారు. హరీశ్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేయించారన్నారు. ఘనకార్యం చేశామని మళ్లీ సిట్ నే కేటీఆర్ ప్రశ్నిస్తామంటున్నారని ఫైర్ అయ్యారు. అధికారం కోసం ఎన్నో కుటుంబాలను కూల్చారని మండిపడ్డారు బీర్ల ఐలయ్య. విచారణకు రమ్మంటే బిల్డప్ డైలాగ్ లు కొడుతున్నారని ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ తో కాంగ్రెస్ నేతలను వేధించారని... సిట్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోదన్నారు.
పదేళ్లు బీఆర్ఎస్ తెలంగాణను దోచుకుందన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కవితే చెబుతున్నారని.. అవినీతి అక్రమాలకు బీఆర్ఎస్ కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో రేవంత్ ,కోదండరాంను అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పారు అద్దంకి దయాకర్.
అంతకు ముందు మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. కేసులు కొత్త కాదని బెదిరింపులకు భయపడబోమన్నారు . ఎంక్వైరీలకు భయపడేటోళ్లు..బాధపడేవారు లేరన్నారు. అధికారంలో ఉన్నపుడు ప్రజల కోసమే పనిచేశామని..ఏనాడు తప్పుడు పనులు చేయలేదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు కేటీఆర్.
