నవీన్ యాదవ్కు గౌడ సంఘాల మద్దతు

నవీన్ యాదవ్కు  గౌడ సంఘాల మద్దతు

జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు గౌడ సంఘాలు స్పష్టం చేశారు. గురువారం మధురానగర్ లో జరిగిన ఆత్మీయ గౌడ సమ్మేళనంలో ముఖ్యఅతిథులుగా మంత్రి పొన్నం ప్రభాకర్, సినీ నటుడు సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గౌడ్స్, ముదిరాజులు, నాయీబ్రాహ్మణులు, యాదవ్స్ ఇతర బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు అందేలా కుల సర్వే చేయించి అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపామని అయితే దానికి అడ్డంకులు ఎదురవుతున్నాయన్నారు. 

దానిపై తప్పనిసరిగా తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఐక్యమత్యంగా ఉంటేనే మన సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించినట్లే, జూబ్లీహిల్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. నవీన్ యాదవ్ కు కేబినెట్ అండ ఉందని, స్థానిక సమస్యలు తెలిసిన వ్యక్తి, ఎవరికి వారే అభ్యర్థిగా అనుకొని క్షేత్రస్థాయిలో పనిచేసే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. 

నవీన్ యాదవ్ ను గెలిపించేందుకు నటుడు సుమన్ ప్రతి గల్లీగల్లీ తిరుగుతున్నారని అలాగే ప్రతి నాయకుడు, కార్యకర్త క్షేత్రస్థాయిలో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హస్త కళల కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ గౌడ్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, చిన్న శ్రీశైలం యాదవ్, ఇతర ముఖ్య నేతలు, గౌడ సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు.