‘గౌరవెల్లి’ భూసేకరణ పూర్తి చేయండి.. ప్రభుత్వం నిధులు విడుదల చేసింది

‘గౌరవెల్లి’ భూసేకరణ పూర్తి చేయండి.. ప్రభుత్వం నిధులు విడుదల చేసింది

హుస్నాబాద్, వెలుగు: గౌరవెల్లి ప్రాజెక్ట్ కాలువల భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌‌‌‌లో మండల, డివిజనల్ స్థాయి అధికారులతో నియోజకవర్గ అభివృద్ధి, రెవెన్యూ అంశాలు, భూసేకరణ పురోగతిపై ఆయన వేర్వేరుగా రివ్యూ నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రాజెక్ట్ పరిధిలోని మూడు జిల్లాల్లో భూసేకరణకు అవసరమైన నిధులను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిందన్నారు. నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేసి, విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి పెయింటింగ్‌‌‌‌లు, మరమ్మతులు, మౌలిక వసతుల పనులన్నీ వంద శాతం పూర్తి కావాలని ఆదేశించారు. 

చౌటపల్లి పారిశ్రామిక కారిడార్ భూసేకరణ పనుల పురోగతిని సమీక్షించిన మంత్రి, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రివ్యూలో ఆర్డీవోలు రామ్మూర్తి, తహసీల్దార్లు లక్ష్మారెడ్డి, మధుసూదన్, నవీన్, ఎంఈవో మనీలా తదితర అధికారులు పాల్గొన్నారు.