గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లకు జాయింట్ కమిషనర్లుగా బాధ్యతలు

గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లకు జాయింట్ కమిషనర్లుగా బాధ్యతలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: పలు సర్కిళ్లలో విధులు నిర్వహిస్తున్న గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లకు జాయింట్ కమిషనర్లుగా బాధ్యతలు అప్పగిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు డాక్టర్ ఎన్.యాదగిరిరావును శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లకు జాయింట్ కమిషనర్(శానిటేషన్)గా నియమించారు. 

కుత్బుల్లాపూర్​ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మల్లయ్యను హెడ్ ఆఫీస్‌లో జాయింట్ కమిషనర్(ఎలక్షన్స్)గా పోస్టింగ్ ఇవ్వగా, అదే సర్కిల్‌కు స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ శ్రీపాద రామేశ్వర్‌ను డిప్యూటీ కమిషనర్‌గా నియమించారు. కార్వాన్ డిప్యూటీ కమిషనర్ అహ్మద్ షఫీయుల్లాను బహద్దూర్‌పురా సర్కిల్‌కు బదిలీ చేసి, ఆయన స్థానంలో రాజేశ్ కుమార్‌ను డిప్యూటీ కమిషనర్‌గా నియమించారు. 

జాయింట్ కమిషనర్(అడ్మిన్) సరస్వతిని బడంగ్‌పేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌గా నియమించి, ఆమె స్థానంలో ఎస్. జయంత్‌ను నియమించారు. గ్రేడ్-1 మున్సిపల్ కమిషనర్ టి.ప్రవీణ్ కుమార్ రెడ్డిని ముషీరాబాద్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌గా, గ్రేడ్-2 కమిషనర్ బి.సత్యనారాయణను యూసుఫ్‌గూడ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌గా నియమిస్తూ, అక్కడి డీసీ డి.శంకర్ సింగ్‌ను జీడిమెట్ల సర్కిల్‌కు బదిలీ చేశారు. జీడిమెట్ల సర్కిల్ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ నర్సింహాను జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. 

గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్ సీహెచ్.వేణును కొంపల్లి సర్కిల్ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్‌గా నియమించారు. అమీర్‌పేట డీఎల్‌పీఓ ఎ.జ్యోతిని అమీన్‌పూర్ సర్కిల్‌కు బదిలీ చేసి, అక్కడి డిప్యూటీ కమిషనర్ సురేశ్‌ను జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్‌గా నియమించారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని కమిషనర్ తెలిపారు.