మెల్‌బోర్న్: సెర్బియా సూపర్ స్టార్ నొవాక్ జొకోవిచ్.. తన గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ కెరీర్‌లో 399వ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భాగంగా గురువారం జరిగిన మెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో నాలుగోసీడ్ జొకో 6–3, 6–2, 6–2తో ఫ్రాన్సిస్కో మాస్ట్రెల్లీ (ఇటలీ)పై గెలవడం ద్వారా ఈ ఘనత సాధించాడు. మరొక్క మ్యాచ్ గెలిస్తే 400 విజయాలు సాధించిన తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టిస్తాడు. మరో మ్యాచ్‌లో స్టాన్ వావ్రింక (స్విట్జర్లాండ్) 4–6, 6–3, 3–6, 7–5, 7–6 (10/3)తో ఆర్థర్ గీ (ఫ్రాన్స్)పై నెగ్గాడు.
తద్వారా 40 ఏండ్ల 310 రోజుల వయసులో ఈ టోర్నీలో మూడో రౌండ్‌లోకి ప్రవేశించిన తొలి ప్లేయర్‌గా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో యానిక్ సినర్ (ఇటలీ) 6–1, 6–4, 6–2తో జేమ్స్ డక్‌వర్త్ (ఆస్ట్రేలియా)పై, ముసెటీ (ఇటలీ) 6–3, 6–3, 6–4తో సోనెగో (ఇటలీ)పై, షెల్టన్ (అమెరికా) 6–3, 6–2, 6–2తో స్వీని (ఆస్ట్రేలియా)పై, ఫ్రిట్జ్ (అమెరికా) 6–1, 6–4, 7–6 (7/4)తో కొప్రివా (చెక్)పై నెగ్గారు. విమెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో ఇగా స్వైటెక్ (పోలెండ్) 6–2, 6–3తో మరియా బౌజుకోవా (చెక్)పై, పెగులా (అమెరికా) 6–0, 6–2తో కెస్లెర్ (అమెరికా)పై గెలిచి మూడో రౌండ్ చేరారు. రిబకినా (కజకిస్తాన్) 7–5, 6–2తో గ్రాచెవా (ఫ్రాన్స్)పై, అనిసిమోవా (అమెరికా) 6–1, 6–4తో సినియాకోవా (చెక్)పై, కీస్ (అమెరికా) 6–1, 7–5తో క్రుగెర్ (అమెరికా)పై గెలిచి టోర్నీలో ముందంజ వేశారు.
