చెస్‌‌ ఒలింపియాడ్‌‌లో పతకం నెగ్గాలన్న కల నెరవేరింది

చెస్‌‌ ఒలింపియాడ్‌‌లో పతకం నెగ్గాలన్న కల నెరవేరింది

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  ప్రతిష్టాత్మక చెస్‌‌ ఒలింపియాడ్‌‌లో పతకం నెగ్గాలన్న తన కల ఎట్టకేలకు నెరవేరిందని తెలుగు గ్రాండ్‌‌మాస్టర్ ద్రోణవల్లి హారిక చెప్పింది. మామల్లపురంలో జరిగిన ఈ టోర్నీలో బ్రాంజ్‌‌ నెగ్గిన ఇండియా విమెన్స్‌‌ జట్టులో మెంబర్‌‌ అయిన హారిక తొమ్మిది నెలల గర్భంతోనే ఆడింది. ఇండియాలో ఈ టోర్నీ జరుగుతుందని తెలిసినప్పటి నుంచి ఎలాగైనా పతకం నెగ్గాలని అనుకున్నానని ఆమె తెలిపింది. ‘నేను ఇండియా చెస్ జట్టులోకి  అడుగుపెట్టి 18 ఏళ్లు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు 9 ఒలింపియాడ్స్​లో పాల్గొన్నా.  ఇండియా విమెన్స్‌‌ టీమ్‌‌ తరఫున పోడియంపై నిలుచోవాలని ప్రతీసారి కలగన్నా. చివరకు ఈసారి అది నిజమైంది. తొమ్మిది నెలల గర్భంతో ఉన్నప్పుడు దీన్ని సాధించినందున ఇంకాస్త ఎమోషనల్‌‌గా ఉన్నా అని తెలిపింది. 

సీమంతం..వేడుకలు ఏమీ లేవు..
ఇండియాలో ఒలింపియాడ్ జరుగుతుందని తెలియగానే డాక్టర్‌‌ను సంప్రదించా.  ఎటువంటి సమస్యలు లేకుండా, ఆరోగ్యంగా ఉంటే టోర్నీలో ఆడొచ్చని చెప్పారు. అప్పటి నుంచి నా లైఫ్‌‌ మొత్తం ఒలింపియాడ్‌‌లో పాల్గొని పతకం నెగ్గడం చుట్టూనే తిరిగింది. నా ప్రతి ఒక్క అడుగు  దాన్ని సాధ్యం చేయడానికే అంకితం చేశాం.  సీమంతం, వేడుకలు, పార్టీలు  ఏమీ లేవు. అన్నీ పతకం సాధించిన తర్వాతే అని  నిర్ణయించుకున్నా.  టోర్నీలో బాగా ఆడాలని ప్రతి రోజూ కష్టపడ్డా.  నిజం చెప్పాలంటే, గత కొన్ని నెలలుగా నేను ఈ క్షణం కోసమే జీవించా. చివరకు సాధించా’ అని హారిక ట్విట్టర్‌‌ పోస్ట్‌‌లో పేర్కొంది.