KKR vs DC: బ్యాటర్ అవతారమెత్తిన కుల్దీప్.. కోల్‌కతా టార్గెట్ 154  

KKR vs DC: బ్యాటర్ అవతారమెత్తిన కుల్దీప్.. కోల్‌కతా టార్గెట్ 154  

ఈడెన్ గడ్డపై కోల్‌క‌తా బౌలర్లు విజృంభించారు. వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు పడగొట్టగా, హర్షిత్ రానా, వైభవ్ అరోరా రెండేసి వికెట్లు తీసుకున్నారు. దీంతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. చివరలో కుల్దీప్‌ యాదవ్ బ్యాటర్ అవతారమెత్తి 26 బంతుల్లోనే 35 పరుగులు చేశాడు. దాంతో ఢిల్లీ ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. 

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఆది నుంచి వికెట్లు కోల్పోతూనే వచ్చింది. రెండో ఓవర్ లోనే పృథ్వీ షా (13) ఔటయ్యాడు. వైభవ్ అరోరా వేసిన 1.3 ఓవర్‌కు వికెట్ కీపర్‌ సాల్ట్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఆపై స్టార్క్ త‌న రెండో ఓవ‌ర్‌లో జేక్ ఫ్రేజ‌ర్ మెక్‌గుర్క్ (12)ను ఔట్ చేసి ఢిల్లీ శిబిరంలో అలజడి రేపాడు. ఆ మరుసటి ఓవర్‌లో వైభవ్‌ అరోరా.. ఓ చక్కని బంతితో షై హోప్ (6)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో ఢిల్లీ 37 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. 

పవర్ ప్లే అనంతరం బాల్ చేతి కందుకున్న వ‌రుణ్ చ‌క్రవ‌ర్తి వ‌రుస ఓవర్లలో ట్రిస్టన్ స్టబ్స్(4), కెప్టెన్ రిష‌భ్ పంత్(27)ను ఔట్ చేసి ఢిల్లీని మ‌రింత ఒత్తిడిలోకి నెట్టాడు. సునీల్ నరైన్ సైతం స్పిన్ ఉచ్చు బిగించ‌డంతో పరుగులు రావ‌డం కష్టమై పోయింది. ఒకానొక సమయంలో కోల్‌క‌తా బౌల‌ర్ల ధాటికి ఢిల్లీ వంద లోపే 6 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో కుల్దీప్‌ యాదవ్(26 బంతుల్లో 35 నాటౌట్; 5 ఫోర్లు, ఒక సిక్స్) బ్యాటర్ అవతారమెత్తాడు. స్టార్క్ వేసిన 16 ఓవర్‌లో ఓ సిక్స్, ఫోర్ బాది తన బ్యాటింగ్ నైపుణ్యం ఏంటో చూపెట్టాడు. మొత్తానికి అడపా దడపా బౌండరీలు సాధిస్తూ స్కోరును 150 పరుగులు దాటించాడు.