గణపురం, వెలుగు: ఆస్తి, డబ్బు కోసం ఓ యువకుడు తన నానమ్మను హత్య చేశాడు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గొల్లపల్లి గ్రామంలో మంగళవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. గొల్లపల్లి గ్రామానికి చెందిన పెండ్యాల ఐలమ్మ (60) కొడుకు చనిపోవడంతో మనవడి వద్ద ఉంటోంది. ఆస్తి, డబ్బు విషయంలో ఐలమ్మకు ఆమె మనవడు జాకేందర్ మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో శనివారం సైతం ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో జాకేందర్, అతడి భార్య అనుకృతి కలిసి కర్రతో కొట్టడంతో ఐలమ్మ చనిపోయింది. తెల్లారి అంత్యక్రియలు సైతం నిర్వహించారు. హత్య విషయం గ్రామస్తుల ద్వారా పోలీసులకు చేరడంతో వారు మంగళవారం గ్రామానికి చేరుకొని జాకేందర్, అనుకృతిని అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ చెన్నమనేని కర్ణాకర్‌రావు తెలిపారు.
