తాగునీటి సమస్యకు చెక్.!..సమ్మర్ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్న బల్దియా ఆఫీసర్లు

తాగునీటి సమస్యకు చెక్.!..సమ్మర్ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్న బల్దియా ఆఫీసర్లు
  • క్షేత్రస్థాయి ఇబ్బందులను పరిష్కరించేందుకు కసరత్తు
  • వరంగల్ నగరంలోని లీకేజీలపై ఫోకస్ 

హనుమకొండ, వెలుగు:  గ్రేటర్ వరంగల్ పరిధిలోని చాలా డివిజన్లలో తాగునీటి సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. క్షేత్రస్థాయిలో లీకేజీలు, ఇతర సమస్యల కారణంగా వాటర్ సప్లై సిస్టంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు నగరంలో తాగునీటి సరఫరాపై ఫోకస్ పెట్టారు. ఎండాకాలం ఎంటర్ కావడంతో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు.

రిజర్వాయర్ నిండా నీళ్లున్నా తాగునీటి సరఫరా వ్యవస్థకు క్షేత్రస్థాయి లీకేజీలు ప్రధాన సమస్యగా మారగా, ముందుగా డివిజన్ల వారీగా వాటిని గుర్తించి, యుద్ధప్రాతిపదికన రిపేర్లు చేయించేందుకు కసరత్తు చేస్తున్నారు. నగరంలోని స్లమ్ ఏరియాల్లో వాటర్ సప్లై లేని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.

లీకేజీలే ప్రధాన సమస్య..

రిజర్వాయర్ నిండా నీళ్లున్నా క్షేత్రస్థాయిలో లీకేజీల కారణంగా తాగునీటి సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. గ్రేటర్ వరంగల్ లో ఒక్కో డివిజన్ లో సగటున 10 వరకు లీకేజీలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. సిటీ వ్యాప్తంగా 600కుపైగా లీకేజీలు ఉంటాయని పేర్కొంటున్నారు. వీటితో పాటు నగరంలో చాలాచోట్లా ఓల్డ్ పైప్ లైన్ లీకేజీల కారణంగా సమస్యలు తలెత్తుతున్నాయి. లీకేజీలను రిపేర్ చేసిన కొన్నిరోజులకే మళ్లీ పైపులు పగులుతున్నాయి. దీంతో బల్దియా అధికారులు నామమాత్రంగా రిపేర్లు చేసి చేతులు దులిపేసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

సమస్యలు తలెత్తకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్..

నగరంలో లీకేజీలతో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఏర్పడుతుండగా కొన్నిచోట్ల పైపులైన్ లేక వాటర్ సప్లై జరగడం లేదు. ముఖ్యంగా నగరంలో మొత్తంగా 183 స్లమ్ ఏరియాలు ఉండగా అందులో చాలా వాటికి డ్రింకింగ్ వాటర్ సప్లై సిస్టం లేదు. దీంతో ఏటా సమ్మర్ ఆయా ప్రాంతాల ప్రజలు నీళ్ల కోసం ఇబ్బందులు పడాల్సివస్తోంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బల్దియా అధికారులు సమ్మర్ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు.

ఎక్కడికక్కడ లీకేజీలను అరికట్టడంతోపాటు బోర్లు ఫ్లషింగ్ చేయించడం, స్లమ్ ఏరియాలు, సమస్యాత్మక ప్రాంతాలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో లీకేజీలను అరికట్టేందుకు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. వడ్డేపల్లి, కేయూ, దేశాయిపేట ఫిల్టర్ బెడ్లలో సమస్యలు పరిష్కరించడంతో పాటు కెమికల్స్ సరిపడా అందుబాటులో ఉంచేలా చర్యలు చేపడుతున్నారు.

సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా నగరంలోని మెయిన్ సెంటర్లలో చలివేంద్రాలు పెట్టడంతో పాటు జంక్షన్ల వద్ద నీడ కోసం గ్రీన్ కలర్ మ్యాట్స్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. నగర తాగునీటి అవసరాలను తీర్చేందుకు సరిపడా నీళ్లు అందుబాటులో ఉన్నాయని, వేసవిలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టనున్నట్లు బల్దియా అధికారులు చెబుతున్నారు.

పుష్కలంగా ‘ధర్మసాగర్’..

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లలో దాదాపు 2.5 లక్షల ఇండ్లు ఉండగా, 11 లక్షలకు పైగా జనాభా నివసిస్తోంది. నగర జనాభా అవసరాలకు నిత్యం 173 మిలియన్ లీటర్ అవసరం కాగా, దేవాదుల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకుని వడ్డేపల్లి, కేయూ, దేశాయిపేట ఫిల్టర్ బెడ్లలో శుద్ధి చేసి ఇంటింటికీ సరఫరా చేస్తున్నారు. వేసవి ప్రారంభం కావడం, నగర తాగునీటి అవసరాలు, మిగతా రిజర్వాయర్లకు పంపింగ్ ను దృష్టిలో పెట్టుకుని ధర్మసాగర్ రిజర్వాయర్ నింపుతున్నారు. దీంతో రిజర్వాయర్ ఫుల్ కెపాసిటీ 1.5 టీఎంసీలు కాగా, 1.3 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.