- నాలుగేండ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరి
- గైడ్ లైన్స్ రిలీజ్ చేసిన డైరెక్టర్
హైదరాబాద్, వెలుగు: స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ లో బదిలీలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ఇచ్చింది. చాలాకాలంగా నిలిచిపోయిన ట్రాన్స్ఫర్లపై నిషేధాన్ని ఎత్తివేయగా, దానికి అనుగుణంగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు. స్టేట్, మల్టీ జోనల్, జోనల్ సహా జిల్లా కేడర్ ఉద్యోగులందరికీ ఆన్‌లైన్ విధానంలో బదిలీలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.
2026 జనవరి ఒకటో తేదీ నాటికి ఒకే స్టేషన్లో మూడేళ్ల సర్వీస్పూర్తి చేసుకున్న వారు బదిలీలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తెలిపారు. అలాగే, 2025 డిసెంబర్ 31 నాటికి ఒకే చోట నాలుగేండ్లు పూర్తయిన వారిని తప్పనిసరిగా ట్రాన్స్ఫర్ చేయనున్నారు. అయితే, ఏ కేడర్‌లోనైనా మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 40 శాతానికి మించి బదిలీలు చేయకూడదని నిబంధన విధించారు. 2027 మే 31లోపు రిటైరయ్యే ఉద్యోగులు నాలుగేళ్ల సర్వీస్పూర్తి చేసుకున్నప్పటికీ, బదిలీ చేయొద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఖాళీల జాబితాపై ఆదేశాలు
మే 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అర్హులైన ఉద్యోగులు ఆన్‌లైన్‌లో ఆప్షన్లు ఇచ్చుకోవాలని డైరెక్టర్ సూచించారు. ఇందుకోసం కేడర్ల వారీగా ఖాళీల జాబితాను ముందుగానే నోటీసు బోర్డులు, అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని ఆర్‌జేడీలు, డీఈవోలను ఆదేశించారు. క్లియర్ వేకెన్సీలతో పాటు తప్పనిసరి బదిలీల ద్వారా ఏర్పడే వేకెన్సీలను కూడా ప్రకటించాలని సూచించారు.

