ఔటర్ రింగ్ రోడ్డుపై గ్రీనరీకి హై ట్రిమ్మింగ్ మెషీన్లు..నీళ్లు కొట్టేందుకు ఆటోమేటెడ్ ఇరిగేషన్, డ్రిప్ స్ప్రింక్లర్ వ్యవస్థ

ఔటర్ రింగ్ రోడ్డుపై  గ్రీనరీకి హై ట్రిమ్మింగ్ మెషీన్లు..నీళ్లు కొట్టేందుకు ఆటోమేటెడ్ ఇరిగేషన్, డ్రిప్ స్ప్రింక్లర్ వ్యవస్థ
  •      రోజుకు 5 నుంచి 7 కి.మీ. మేర చెట్లను ట్రిమ్మింగ్ చేస్తయ్​ 
  •     10 మంది కార్మికులతో చేయిస్తే 5 రోజులు పట్టే అవకాశం  

 హైదరాబాద్​సిటీ, వెలుగు: అసలే ఔటర్​రింగ్ రోడ్​.. భారీ వాహనాలు, విపరీతమైన స్పీడ్​లో ప్రయాణాలు. ఇటీవల అనేక వాహనాల యాక్సిడెంట్లతో ఈ రోడ్​పై పనులు నిర్వహించడం అంటే ప్రమాదాలతో చెలగాటంగా మారింది. అనేక సార్లు ఇక్కడ మ్యాన్యువల్​గా పనులు నిర్వహిస్తున్న టైంలో, చెట్లకు నీళ్లు పోసే టైంలో పలువురు కూలీలు, సిబ్బంది ప్రమాదాలకు గురయ్యారు. 

ఈ నేపథ్యంలో హెచ్ఎండీఏ అర్బన్​ఫారెస్ట్రీ అధికారులు సరికొత్త పద్ధతిలో గ్రీనరీ బ్యూటిఫికేషన్​పనులకు శ్రీకారం చుట్టారు. హైట్రిమ్మర్​పేరుతో ఆధునిక యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ యంత్రాలతో పనులు నిర్వహించడం చాలా సులభం. ఎక్కువ మంది మనుషులు అవసరం లేకుండా పూర్తిగా ఆటోమేటిక్​గా మొక్కల ట్రిమ్మింగ్​ చేయడం దీని ప్రత్యేకతగా అధికారులు తెలిపారు.


హై ట్రిమ్మర్​ఎలా పని చేస్తుందంటే..

ఓఆర్ఆర్ పై మొక్కలను ట్రిమ్మింగ్​ చేసే పనుల నిర్వహణకు అధికారులు హై ట్రిమ్మర్​ పేరుతో ఆధునిక యంత్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ఆటోమేటిక్​ మెషినరీ వల్ల మనుషుల అవసరం లేకుండా ఈ యంత్రం ద్వారానే ట్రిమ్మింగ్​పనులు నిర్వహించవచ్చని అర్బన్​ఫారెస్ట్ డైరెక్టర్​ రోహిత్​రెడ్డి గోపిడి వెల్లడించారు. ఒక్కో మెషిన్​ను 10 లక్షలతో యూరప్​ నుంచి దిగుమతి చేసుకున్నట్టు వెల్లడించారు.

 ఒక్కో మెషీన్​రోజుకు 5 నుంచి 7 కిమీ. వరకూ మొక్కల ట్రిమ్మింగ్​పనులు నిర్వహిస్తుందని అధికారులు తెలిపారు. ఈ పనులు మాన్యువల్​గా నిర్వహించాలంటే 10 మంది మనుషులు 5 రోజులు చేయాల్సి వస్తుందన్నారు. ఇక ట్యాంకర్ల ద్వారా రోజూ మొక్కలకు నీటిని పోసేందుకు కూడా ప్రత్యేకంగా డ్రిప్​ ఇరిగేషన్​ సిస్టమ్​ ద్వారా డ్రిప్​ స్ప్రింక్లర్స్​తో నీటి పోసేలా చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. 

ఈ విధానం వల్ల ట్యాంకర్ల వినియోగానికి స్వస్తిచెప్పవచ్చన్నారు. ఔటర్​రింగ్​రోడ్​ పొడవునా 158 కి.మీ. పరిధిలో అర్బన్​ ఫారెస్ట్రీ సెంట్రల్​ మీడియన్​తోపాటు, రోడ్డుకు ఇరువైపుల మొక్కలు, చెట్లను కూడా నాటి అభివృద్ధి చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ కొత్త విధానం అందుబాటులోకి తీసుకు రావడం వల్ల ప్రమాదాలను నివారించడమే కాకుండా యంత్రాల ద్వారా పనులు చేయడం వల్ల పనులు వేగంగా జరుగుతాయని అధికారులు తెలిపారు.