తెలంగాణ బీజేవైఎంలో గ్రూప్​ తగాదాలు

తెలంగాణ బీజేవైఎంలో గ్రూప్​ తగాదాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బీజేవైఎంలో గ్రూప్ తగాదాలు బయటపడ్డాయి. ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు, బెంగళూర్ ఎంపీ తేజస్వీ సూర్య హైదరాబాద్​కు రాగా.. సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్ వర్గం, జాతీయ కోశాధికారి సాయి ప్రతాప్ వర్గం మధ్య విభే దాలు భగ్గుమన్నాయి. బీజేపీ స్టేట్ ఆఫీసు ముందే భాను ప్రకాశ్ వర్గం ఆందోళనకు దిగింది. బీజేపీ రాష్ట్ర ఇన్​చార్జ్​ తరుణ్ చుగ్ సమక్షంలోనే ఈ గొడవ జరగడంతో చివరికి మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు జోక్యంతో సద్దుమణిగింది. బీజేవైఎం జాతీయ కోశాధికారిగా ఉన్న రాష్ట్రానికి చెందిన సాయి ప్రతాప్​కు తేజస్వీ సూర్య అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న తమ నేతను  ఏమాత్రం పట్టించుకోవడం లేదనేది భాను ప్రకాశ్ వర్గం ఆరోపిస్తున్నది. ఇటు భాను ప్రకాశ్.. అటు సాయి ప్రతాప్ ఇద్దరూ అసెంబ్లీ ఎన్నికల్లో  మల్కాజిగిరి నుంచి బీజేపీ టికెట్​ ఆశిస్తున్నారు. 

దీంతో ఈ ఇద్దరి మధ్య కొంత కాలంగా వర్గపోరు కొనసాగుతున్నది. తేజస్వీ సూర్య హైదరాబాద్​ రాక సందర్భంగా ఇది బయటపడింది. బీజేపీ స్టేట్ ఆఫీసులో గురువారం ఏర్పాటు చేసిన బీజేవైఎం వర్క్  షాపు ప్రారంభోత్సవానికి చీఫ్ గెస్టుగా తేజస్వీ సూర్య హాజరయ్యేందుకు బుధవారం రాత్రి హైదరాబాద్​కు చేరుకున్నారు. ఆయన కోసం హోటల్ రాడిసన్​లో భానుప్రకాశ్ బస ఏర్పాటు చేశా రు. అయితే ఆ ఆతిథ్యాన్ని స్వీకరించకుండా తేజస్వీ సూర్య.. సాయిప్రతాప్ ఏర్పాటు చేసిన బస వద్దకు వెళ్లారు. దీంతో భానుప్రకాశ్ వర్గం గురువారం ఉద యం బీజేవైఎం వర్క్ షాపు ప్రారంభోత్సవానికి బీజేపీ స్టేట్ ఆఫీసుకు వచ్చిన తేజస్వి సూర్యను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో వర్క్ షాపు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని భానుప్రకాశ్ బహిష్కరించారు.

 బీజేవైఎంలోని లీడర్ల తీరుపై బీజేపీ ముఖ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పార్టీ ఆఫీసులోనే తేజస్వీ సూర్య భేటీ అయ్యారు. జరిగిన గొడవతో పాటు రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలుపులో బీజేవైఎం పోషించే పాత్రపై, బీజేవైఎం నేతలకు టికెట్ల కేటాయింపుపై కూడా ఇందులో చర్చ సాగింది. అంతకు ముందు తేజస్వీ సూర్య.. బీజేవైఎం వర్క్ షాపును ప్రారంభించారు. ఇందులో సోషల్ మీడియా టీం కూడా పాల్గొంది.