గ్రూప్ 4 ఎగ్జామ్ పేపర్ 1 ఈజీ.. పేపర్ 2 టఫ్..

 గ్రూప్ 4 ఎగ్జామ్ పేపర్ 1 ఈజీ.. పేపర్ 2 టఫ్..
  • ముగిసిన గ్రూప్ 4 ఎగ్జామ్.. 7.61 లక్షల మంది హాజరు  
  • అభ్యర్థుల వేలిముద్రల సేకరణ 
  • నిమిషం ఆలస్యమైనా అనుమతించని అధికారులు 
  • సెల్ ఫోన్​తో సెంటర్ లోకి ఎంటరైన అభ్యర్థిపై కేసు 

హైదరాబాద్/నెట్ వర్క్, వెలుగు: గ్రూప్ 4 ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల పరిధిలో 2,878 సెంటర్లలో ఎగ్జామ్ నిర్వహించగా.. 80 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 8,180 పోస్టులకు గాను 9,51,321 మంది అప్లై చేశారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరిగిన పేపర్​1కు 7,62,872 (80.20%)  మంది హాజరు కాగా.. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పేపర్ 2కు 7,61,198 (80.02%) మంది హాజరయ్యారు. 

అధికారులు ముందుగా చెప్పినట్టే పరీక్షకు 15 నిమిషాల ముందే సెంటర్ల గేట్లను మూసివేశారు. ఒకట్రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులనూ లోపలికి అనుమతించలేదు. లోపలికి పంపించాలని అభ్యర్థులు వేడుకున్నా అధికారులు కనికరించకపోవడంతో వందలాది మంది నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. అధికారులు అనుమతించకపోవడంతో కొంతమంది అభ్యర్థులు హైదరాబాద్ లోని నిజాం కాలేజీ వద్ద ఆందోళన చేపట్టారు. కొన్ని సెంటర్లలో అమ్మాయిల నగలు, అబ్బాయిల బెల్టులు కూడా తీసివేయించారు. ఉదయం, మధ్యాహ్నం రెండుసార్లూ ఇన్విజిలేటర్లు అభ్యర్థుల నుంచి వేలిముద్రలు సేకరించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, కొంతమంది అభ్యర్థులు పేపర్ 1 రాసి.. పేపర్ 2కు హాజరు కాలేదు.  

పేపర్ 2లో స్కోర్ చేస్తేనే జాబ్.. 

గ్రూప్ 4 ఎగ్జామ్ కఠినంగానే ఉందని అభ్యర్థులు చెబుతున్నారు. పేపర్ 1 (జనరల్ స్టడీస్) కొంత ఈజీగా వచ్చినప్పటికీ, పేపర్ 2 (సెక్రటేరియల్ ఎబిలిటీస్) మస్తు టఫ్ వచ్చిందని అంటున్నారు.  పేపర్ 2లో వచ్చే మార్కులపైనే జాబ్ ఆధారపడి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. పేపర్ 1లో పాలిటీ నుంచి 20కి పైగా క్వశ్చన్లు వచ్చాయి. తెలంగాణ చరిత్రపై ఎక్కువ ప్రశ్నలు రాగా, ఉద్యమంపై తక్కువ ప్రశ్నలు అడిగారు. పేపర్ 2లో జనరల్ ఇంగ్లిష్ నుంచి 40 క్వశ్చన్లు రాగా, అవన్నీ ఈజీగానే ఉన్నాయని అభ్యర్థులు చెబుతున్నారు. మిగిలిన 110 ప్రశ్నలు అర్థమేటిక్, రీజనింగ్ నుంచే వచ్చాయని.. అవన్నీ కఠినంగానే ఉన్నాయని పేర్కొంటున్నారు. 

టైమ్ సరిపోలేదని ఆవేదన చెందుతున్నారు. ‘‘పేపర్ 1లో ఎక్కువ మందికి 70 నుంచి 80 మార్కులు వచ్చే అవకాశం ఉంది. ప్రిపేర్ అయిన అభ్యర్థులకైతే 90 నుంచి వంద వరకు రావొచ్చు. పేపర్ 2లో మాత్రం రీజనింగ్, మెంటల్ ఎబిలిటీస్ లో ఎక్కువ టైమ్ తీసుకునే క్వశ్చన్లు ఇచ్చారు. ఇందులో 60 నుంచి70 మార్కులు దాటడం కూడా కష్టమే” అని అంటున్నారు. అయితే బ్యాంకింగ్, ఎస్ఎస్​సీ ఎగ్జామ్స్ కు ప్రిపేరైన వారికి మాత్రం కొంత కలిసొచ్చే అవకాశం ఉందంటున్నారు. పేపర్ 2లో చాలా తక్కువే మందికే 90 మార్కులు దాటొచ్చని, ఓవరాల్ కటాఫ్ 180 వరకు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

సెల్ ఫోన్ తో సెంటర్ లోకి.. 

ఓ అభ్యర్థి సెల్ ఫోన్​తో ఎగ్జామ్ సెంటర్​లోకి వెళ్లాడు. పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత అతని దగ్గర సెల్ ఫోన్ ఉన్నట్టు ఇన్విజిలెటర్ గుర్తించాడు. అధికారులకు సమాచారం ఇవ్వగా, వాళ్లు వచ్చి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఆ అభ్యర్థిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతనిపై మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన హైదరాబాద్ సరూర్ నగర్ మండలం మారుతినగర్ లోని సక్సెస్ జూనియర్ కాలేజీలో జరిగింది. అయితే ఆ అభ్యర్థి సెల్ ఫోన్ లోపలికి ఎలా తీసుకెళ్లాడు? అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. 

గోడ దూకి సెంటర్ లోకి.. 

సిద్దిపేట అర్బన్ మండలం ఇందూర్ ఇంజనీరింగ్ కళా శాల సెంటర్​లోకి ఓ వ్యక్తి చొరబడ్డాడు. సిద్దిపేట రూరల్ మండలం చిన్న గుండవెల్లికి చెందిన పుల్లూరు వంశీ.. ఎగ్జామ్ జరుగుతున్న టైమ్​లో గోడ దూకి కాలేజీలోకి వచ్చాడు. సిబ్బంది గమనించి ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తించాడు. పోలీసులకు కేసు నమోదు చేశారు. 

బలగం మూవీ నుంచి ప్రశ్న.. 

గ్రూప్–4 ఎగ్జామ్​లో బలగం మూవీ నుంచి ప్రశ్న అడి గారు. ఇందులో కొమురయ్య పాత్రలో సుధాకర్ రెడ్డి నటించారు. అయితే క్వశ్చన్ పేపర్​లో కొమురయ్య పాత్రను అరుసం మధుసూదన్ పోషించినట్టుగా ఇ చ్చారు. ఈ నాలుగింటికి సంబంధించి జత చేసిన వివరాల్లో సరైనది ఏది? అని ప్రశ్న అడిగారు. కాగా, బలగం మూవీ నుంచి ప్రశ్న రావడంపై దర్శకుడు వేణు ఆనందం వ్యక్తం చేశారు. 

కొంపముంచిన గూగుల్ మ్యాప్.. 

యాదాద్రి జిల్లాలోని భూదాన్ పోచంపల్లికి చెందిన శశిధర్​కు చౌటుప్పల్​లోని కృష్ణవేణి స్కూల్ లో సెంటర్​ పడింది. శశిధర్​గూగుల్ మ్యాప్​లో లొకేషన్​సెట్​చేసుకుని వెళ్లగా, గతంలో స్కూల్​ఉన్న చోటుకు చేరుకున్నాడు. పొరపాటును గుర్తించి కొత్తగా నిర్మించిన స్కూల్ వద్దకు చేరేకునే సరికి ఆలస్యమైంది. దీంతో సిబ్బంది అతన్ని సెంటర్​లోకి  అనుమతించలేదు. ఇక సూర్యాపేట జిల్లా కోదాడ లోని సైదయ్య కాన్సెప్ట్ స్కూల్ కు వచ్చిన ప్రశ్నాపత్రాల బండిల్ కు సీల్ లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు.  సరైన గుర్తింపు కార్డులు తీసుకురాకపోవడంతో కామారెడ్డిలో నలుగురిని, నల్గొండలో మరో నలుగురిని సెంటర్లలోకి అనుమతించలేదు. మహబూబ్​నగర్​లోని ఎంఏఎల్డీ కాలేజీలో ఓఎంఆర్ షీట్ గాలికి కొట్టుకుపోయింది. సిబ్బంది పరుగులు పెట్టి, దాన్ని పట్టుకొచ్చారు.