గుజరాత్ పోలీసుల ‘ఆపరేషన్ హైదరాబాద్’

గుజరాత్ పోలీసుల ‘ఆపరేషన్ హైదరాబాద్’
  • సిటీలోని ప్రముఖ ఫర్టిలిటీ సెంటర్లలో సోదాలు
  • చిన్నపిల్లల అక్రమ రవాణా కేసులో దొరికిన మురుగన్​ సమాచారంతో తనిఖీలు
  • నగరం కేంద్రంగా దేశవ్యాప్తంగా దందా  
  • హైప్రొఫైల్  వ్యక్తుల కోసం వేట

పద్మారావునగర్, వెలుగు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న చిన్నారుల అక్రమ రవాణా కేసులో గుజరాత్  పోలీసులు ముందడుగు వేశారు. మురుగన్​అనే నిందితుడు గుజరాత్​లో చిన్నపిల్లలను అక్రమ రవాణా చేస్తున్నట్టు గుర్తించిన బనస్కాంత పోలీసులు.. ‘ఆపరేషన్ దేవ్’ పేరుతో సోదాలు నిర్వహించారు. ఏప్రిల్ 20న కుమ్రం భీమ్​ జిల్లా కాగజ్​నగర్​లో అతడిని పట్టుకున్నారు. విచారణలో హైదరాబాద్​లోని పలు ఫర్టిలిటీ సెంటర్లతో అతనికి సంబంధాలు ఉన్నాయని, లావాదేవీలు నిర్వహించారని తెలుసుకుని ‘ఆపరేషన్​ హైదరాబాద్’ మొదలుపెట్టారు. గురువారం నగరంలోని పలు దవాఖానలు, ఫర్టిలిటీ సెంటర్లపై ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. కూకట్‌‌పల్లి, బంజారాహిల్స్, సికింద్రాబాద్  వంటి ప్రాంతాల్లోని ప్రముఖ ఫర్టిలిటీ సెంటర్లలో సోదాలు చేశారు. ఈ అక్రమ దందాతో సంబంధమున్న వారి వివరాలను సేకరించారు. 

ఎవరీ మురుగన్.. ఏంటి కథ? 

గుజరాత్​ పోలీసుల విచారణలో మురుగన్​ గురించి విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. మురుగన్​ అసలు పేరు బోదాశు నాగరాజు. ఇతడు గతంలో ఆదిలాబాద్  జిల్లాలోని ఒక ఇటుక బట్టీలో కార్మికుడిగా పనిచేశాడు. మొదట పిల్లలు పుట్టని దంపతులకు ఐవీఎఫ్​ కోసం ఎగ్​డోనర్లను సరఫరా చేసే ఏజెంట్​గా పని మొదలుపెట్టాడు. తక్కువ ఖర్చుతో పిల్లలు కావాలనుకునే వారి బలహీనతను ఆసరాగా చేసుకుని, పసిబిడ్డలను అమ్మే దందాలోకి దిగాడు. గత ఏడాది చైతన్యపురి పోలీస్ స్టేషన్‌‌లో కూడా చిన్నపిల్లల అమ్మకాల కేసులో ఇతడిపై కేసు నమోదైంది. మూడు నెలలు శిక్ష అనుభవించిన తర్వాత బెయిల్‌‌పై విడుదలయ్యాడు.  

విచారణలో బయటపడ్డ నిజాలు  

మురుగన్​ ముఠాను విచారించగా హైదరాబాద్​లోని కొన్ని ఫర్టిలిటీ సెంటర్లతో తమకు సంబంధం ఉందని అంగీకరించారు. నగరం కేంద్రంగానే మురుగన్  తన అక్రమ రవాణా నెట్‌‌వర్క్‌‌ను నడిపించినట్లు విచారణలో తేలింది. జైలు నుంచి వచ్చాక దేశవ్యాప్తంగా తన నెట్‌‌వర్క్‌‌ను ఏర్పాటు చేసుకుని చైల్డ్ ట్రాఫికింగ్‌‌కు పాల్పడ్డట్టు చెప్పాడు. ఏడాదిలో సుమారు 25 మంది పిల్లలను అమ్మగా.. వారిలో ముగ్గురిని హైదరాబాద్‌‌లోనే అమ్మినట్టు చెప్పాడు. ఒక్కో బిడ్డను రూ. 4 లక్షల నుంచి రూ.5 లక్షలు తీసుకున్నట్టు అంగీకరించాడు. సిటీలోని కూకట్‌‌పల్లి, బంజారా హిల్స్, సికింద్రాబాద్‌‌లోని కొన్ని ఫర్టిలిటీ సెంటర్లతో సంబంధాలున్నాయని ఒప్పుకున్నాడు. ఈ సెంటర్ల వద్ద ఉండే తన ఏజెంట్ల ద్వారా సంతానం కోసం వచ్చే వారి వివరాలు సేకరించేవాడు.

దీంతో ఈ ముఠా వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయని గుర్తించిన గుజరాత్​ పోలీసులు వారిని పట్టుకునేందుకు గురువారం హైదరాబాద్ లోని పలు సెంటర్లలో సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్​లోని ఓ సెంటర్​కు నోటీసులు కూడా ఇచ్చినట్టు తెలిసింది. మిగతా వాటి గురించి ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మురుగనే కాకుండా, ఇతడి భార్య కూడా గ్యాంగ్‌‌  నడుపుతూ దందాలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.