
ఓటు హక్కు ప్రతీ ఒక్కరి కనీస బాధ్యత. ప్రతీ పౌరుడు తన ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తగు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఒకే ఒక్క ఓటరు ఉన్న గుజరాత్ రాష్ట్రంలో కూడా ప్రత్యేకంగా పోలింగ్ బూత్ ఏర్పాటు చేసింది. అదేదో మామూలు మారుమూల మండలంలోనో, గ్రామంలోనో కాదు. క్రూర మృగాలతో కూడిన 523 సింహాలున్న గిర్ అడువుల్లో.
గిర్ అడవుల మధ్యన ఉన్న బానేజ్ అనే గ్రామం ఓ తీర్ధయాత్ర ప్రదేశం. ఈ గ్రామంలో నివసించే మహంత్ భారత్ దాస్ గురు దర్శన్ దాస్ ఆ ప్రదేశంలోని బనేశ్వర్ మహాదేవ్ మందిరంలో పూజారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. గత నెల ఏప్రిల్ 23న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అతడు ఓటు హక్కును వినియోగించుకున్నాడు. విశేషమేంటంటే ఒకే ఒక్కరున్న ఆ ఓటరు కోసం ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఆ అరణ్యంలోకి సిబ్బందిని పంపింది. ఓటింగ్ కు ముందు రోజు ఒక పోలింగ్ ఆఫీసర్, ఇద్దరు పోలింగ్ ఏజెంట్లు, ఒక చప్రాసీ, ఇద్దరు పోలీస్ సిబ్బంది, ఒక సీఆర్పీఎఫ్ జవాన్ ను ఎన్నికల విధులు నిర్వహించేందుకు బానేజ్ గ్రామానికి పంపింది
ఈ ఏర్పాట్లన్నీ కేవలం ఒక్క ఓటర్ మహంత్ భారత్ దాస్ కోసమే ఈసీ చేసింది. చుట్టూ సింహాలు తప్ప మనుషులెవరూ లేని ఆ అడవుల్లో ఎన్నికల సిబ్బంది ఏప్రిల్ 23న దిగ్విజయంగా తమ పనిని పూర్తిచేసుకున్నారు. తన ఒక్కడి ఓటు కోసం ఈసీ ఇన్ని ఏర్పాట్లు చేయడంపై భారత్ దాస్ మాట్లాడుతూ ‘ఒక్క ఓటు కోసం ఎన్నికల సంఘం చేసే ఈ ప్రక్రియలో భాగం అవుతున్నందుకు గౌరవంగా భావిస్తున్నాను. ఇది దేశంలో ప్రజాస్వామ్యానికి దక్కిన గౌరవం’ అన్నారు.
‘మొత్తం దేశంలో ఎన్నికల సందర్భంగా 100 శాతం ఓట్లు పడాలని కోరుకుంటున్నాను. నేను అడవిలో ఉంటూ కూడా ఓటేస్తున్నట్టే అంతా ఓటేయాలి. 2002 నుంచి నేను ఇక్కడ ఓటు వేస్తున్నాను. నా కోసం పూర్తి పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తున్నారు. భారతదేశం తన ప్రజాస్వామ్యానికి ఎంత విలువ ఇస్తుందో దీనిని బట్టి అర్థం అవుతుంది’ అని బానేజ్ చెప్పారు.