- గన్నీ బ్యాగులను బ్లాక్ అమ్ముతున్న వ్యాపారులు
- ఒక్కో సంచికి రూ. 10కిపైగా పెంచి విక్రయాలు
- ఇదే అదునుగా దళారుల కొనుగోళ్ల దందా
- వ్యాపారులకు కొమ్ముకాస్తున్న ఆఫీసర్లు.!
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: ఆరుగాలం కష్టపడి పంట మక్కలు పండించడం ఒక ఎత్త్తైతే ధాన్యాన్ని అమ్మడం రైతులకు మరో సవాల్‌గా మారింది. మార్క్‌ఫెడ్ కొనుగోలు సెంటర్ల వద్ద బారదాను లేకపోవడంతో కర్షకుడికి కష్టం మోపైంది. 15 రోజుల కింద వరకు 50 కిలోల బారదాను సంచి రూ.10 నుంచి రూ.20 వరకు మార్కెట్ లో లభించగా, ఇప్పుడు రూ.30పైగా రేటు పెంచి వ్యాపారులు బ్లాక్ దందా చేస్తున్నారు.
ఇదే అదనుగా ప్రైవేటు వ్యాపారులు గన్ని సంచులు రైతులకు అందిస్తూ రూ.2000 క్వింటాతో రైతుల కల్లాల వద్ద కాంటాలు పెట్టి ప్రభుత్వానికి అదే రైతుల డాక్యుమెంట్లతో రూ.2400కు విక్రయాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కల్లాల వద్ద రైతులు రోజుల తరబడి కాపలా ఉన్నా బస్తాలు కాంటా కావడం లేదని, వ్యాపారులు దింపిన బస్తాలు రాత్రికి రాత్రే గోదాముల్లో చేరుతున్నట్లుగా రైతులు చెబుతున్నారు. వ్యాపారులతో మిలాఖత్ అయిన ఆఫీసర్లు వారికి కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
అదను చూసి దందా..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఏడాది మూడు లక్షల ఎకరాల్లో మక్కజొన్న సాగు కాగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 35వేల ఎకరాల్లో సాగు చేశారు. జిల్లాలో మార్క్ ఫైడ్ ఆధ్వర్యంలో కొనుగోలు సెంటర్లు ప్రారంభం అయ్యాయి. మొదటి దశలో రైతులకు గన్నీ బ్యాగులు సప్లయ్ చేశారు. భూపాలపల్లి జిల్లాలో మార్క్ ఫైడ్ ఆధ్వర్యంలో మొగళ్లపల్లి, రేగొండ, కొత్తపల్లిగోరి, గణపురం, భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల మండలాల్లో సెంటర్లు ప్రారంభించిన సమయంలో 67,000 గన్నీ బ్యాగులు రైతులకు అందజేశారు. ప్రస్తుతం గన్నీ బ్యాగుల సప్లయ్ లేకపోవడంతో రైతులు ప్రైవేటు వ్యాపారుల నుంచి కొనుగోలు చేసి కాంటాలు వేస్తున్నారు. ఇదే అదునుగా ప్రైవేటు వ్యాపారులు గన్నీ బ్యాగులను బ్లాక్ చేశారు. ఒక్కసారిగా ఒక్కో బస్తాకు రూ.10 అదనంగా పెంచగా, క్వాలిటీని బట్టి రూ.20 నుంచి రూ.22 వరకు అమ్మారు. ప్రస్తుతం డిమాండ్ పెరిగి పోవడంతో రూ.30పైగా పెంచేశారు.
కల్లాల వద్దే కాంటాలు..
గన్ని సంచుల కోసం తిరగలేక రైతులు ప్రైవేట్ వ్యాపారులకు మక్కలు అమ్ముతున్నారు. కొనుగోలు సెంటర్ల నిర్వాహకులతో ముందుగానే ఒప్పందం చేసుకున్న వ్యాపారులు రైతుల నుంచి రూ.2,000 నుంచి రూ.2,100కు కొనుగోలు చేసి రైతుల డాక్యుమెంటుతో కొనుగోలు సెంటర్లలోనే రూ.2400 అమ్ముతున్నట్లుగా రైతులు చెబుతున్నారు. రైతులు కల్లాల వద్ద పడిగాపులు కాస్తున్నా పట్టించుకోని నిర్వాహకులు వ్యాపారుల బస్తాలు మాత్రమే ఎప్పటికప్పుడు గోదాంల్లోకి తరలిస్తున్నట్లుగా రైతులు ఆరోపిస్తున్నారు. ప్రతి గ్రామానికి ఇద్దరు, ముగ్గురు వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేసి వ్యాపారం నడిపిస్తున్నారు. వ్యాపారులకు ఆఫీసర్లు కొమ్ము కాయడంపై రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.
గన్నీల కొరత ఉంది..
సెంటర్ల వద్ద గన్నీ బ్యాగుల కొరత ఉంది. సెంటర్లు ప్రారంభంలో రైతులకు అనుగుణంగా గన్నీలు ఇచ్చాం. ఈ ఏడాది పంట దిగుబడులు అధికంగా వచ్చాయి. కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇప్పటివరకు 2937.150 క్వింటాళ్ల మక్కలు కొనుగోలు చేశాం. -శ్రీదేవి, మార్క్ ఫైడ్ డీఎం, భూపాలపల్లి
గన్నీ బ్యాగులకే రూ.7వేలు అయ్యింది..
రేగొండ కొనుగోలు సెంటర్ వద్ద మక్కలు ఆరబోసి 11 రోజులు అయ్యింది. పంట పండించడంలో లేని కష్టం అమ్మడంలో ఎక్కువగా ఉంది. బారదానుకు రూ.7వేలు ఖర్చు అయ్యింది. సూతిల్, హమాలీ ఖర్చు ముందు ఇస్తేనే కాంటా వేస్తున్నారు. ఈలెక్కనే పంట అమ్మే ఖర్చు రూ.10 వేలు అవుతుంది. బయట అప్పు తెచ్చి సంచులు, సుతిల్, హమాలీ ఖర్చులు ఎల్లదీయాలి.-
జి. సాంబయ్య, తిరుమలగిరి, రైతు

