ఇంట్లో ఉండి ఏడవండి.. బాధపడండి.. ఉద్యోగులకు సెలవిచ్చిన మార్కెటింగ్ కంపెనీ

ఇంట్లో ఉండి ఏడవండి.. బాధపడండి.. ఉద్యోగులకు సెలవిచ్చిన మార్కెటింగ్ కంపెనీ

ఆదివారం అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆది నుంచి వరుస విజయాలతో జోరు కనబరిచిన రోహిత్‌ సేన.. చివరి మ్యాచ్‌లో తడబడింది. ఈ ఓటమితో భారత క్రీడాలోకం తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. కప్పు చేజారాక పలువురు భారత ఆటగాళ్లు మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ దృశ్యాలు అభిమానుల నూ కంటతడి పెట్టించాయి. ఈ క్రమంలో ఓ మార్కెటింగ్ కంపెనీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 

గురుగ్రామ్‌లోని మార్కెటింగ్ మూవ్స్ ఏజెన్సీ.. ఓటమి బాధలో ఉన్న సంస్థ ఉద్యోగులు కోలుకోవడానికి ఒకరోజు సెలవు ప్రకటించింది. ఈ  మేరకు తమ ఉద్యోగులందరికీ మెయిల్స్ పంపింది. అందుకు సంబంధించిన సందేశాన్నిఒక ఉద్యోగి సోషల్ మీడియాలో పంచుకోగా.. ఈ  విషయం వెలుగులోకి వచ్చింది. 

"మెన్ ఇన్ బ్లూ ప్రపంచ కప్ ట్రోఫీని ఆన్చుకోలేకపోయింది. 140 కోట్ల మంది భారతీయులకు ఇది బాధాకర విషయం. ఆ బాధలో ఉన్న నేను ఇవాళ ఉదయం మెయిల్ ఓపెన్ చేయగానే.. భారత ఓటమి నేపథ్యంలో సెలవు ప్రకటించినట్లు నా బాస్ నుండి సందేశం వచ్చింది. ఆ మెయిల్ చూశాక నేను నమ్మలేకపోయా! ఈ సడలింపు కేవలం ధైర్యాన్ని పెంపొందించేది కాదు, నష్టం నుండి కోలుకోవడానికి, మానసిక స్థితిని తిరిగి పొందడానికి ఇచ్చిన ఒక మంచి అవకాశం.." అని దీక్షా గుప్తా అనే ఉద్యోగి పోస్ట్‌ చేసింది. 

మెయిల్‌లో ఉన్న సందేశం ఏంటంటే..?

"హాయ్ ఉద్యోగులరా! వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్ ఓటమి మన సహచరులను నిరుత్సాహ పరిచినట్లు మేము గుర్తించాం. ఈ సమయంలో మీరు కోలుకోవడానికి ఒక రోజు సెలవు మంజూరు చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఇది ప్రతిఒక్కరూ తిరిగి కోలుకోవడానికి, బలంగా తిరిగి రావడానికి అవకాశం కల్పిస్తుందని మేము నమ్ముతున్నాం.." అన్నది మెయిల్ లోని సారాంశం. ఈ ప్రకటన చూశాక ఇలాంటి బాస్ లు మనకెందుకు తగలరు అని ఏడుస్తున్న ఉద్యోగులు మాత్రం బోలెడు.