V6 News

‘పది’లో ప్రతిభ చాటిన గురుకుల విద్యార్థులు

‘పది’లో ప్రతిభ చాటిన గురుకుల విద్యార్థులు

హైదరాబాద్, వెలుగు: పదో తరగతి ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల విద్యార్థులు ప్రతిభ చాటారు. మొత్తం 98.99 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర సగటు కంటే 4.84 శాతం అధిక ఫలితాలను నమోదు చేసి రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 294 స్కూళ్లకు ఏకంగా 204 స్కూళ్లు  వందశాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఈ పరీక్షలకు మొత్తం 19,245 మంది విద్యార్థులు హాజరుకాగా వారిలో 19,047 మంది (9,093 మంది బాలురు, 9,954 మంది బాలికలు) విజయవంతంగా ఉత్తీర్ణులయ్యారు.

వ్యక్తిగత విషయానికి వస్తే నితీషా, శ్రీనిధి 588 మార్కులతో టాపర్లుగా నిలవగా, సాయి మనోజ్ రెడ్డి, లాస్య 587 మార్కులతో సత్తా చాటారు. 60 మంది విద్యార్థులు 580 కంటే ఎక్కువ మార్కులు, 364 మంది 570 పైచిలుకు, 1,061 మంది 560 కంటే ఎక్కువ మార్కులు సాధించారు. మొత్తంగా 3,598 మంది విద్యార్థులు 90 శాతానికి పైగా మార్కులతో ఉత్తీర్ణులై సంస్థ కీర్తిని చాటారు.

బీసీ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు

బీసీ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. 365 హాస్టళ్ల నుంచి 4,941 మంది పరీక్ష రాయగా, 4,746 మంది ఉత్తీర్ణత సాధించారు.  96.05 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో 285 వసతి గృహాలు నూరు శాతం ఫలితాలను సాధించాయి. ఆదిలాబాద్, హైదరాబాద్, ములుగు జిల్లాలు అగ్రస్థానంలో నిలిచాయి. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, ఇందుకు కృషి చేసిన బోధనా సిబ్బందిని మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్య కార్యదర్శి బాల మాయాదేవి, ఎంజేపి కార్యదర్శి సైదులు అభినందించారు.

​సోషల్ వెల్ఫేర్ గురుకులాల ప్రభంజనం

పదో తరగతి ఫలితాల్లో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకులాల విద్యార్థులు సరికొత్త రికార్డు సృష్టించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 235 గురుకులాల నుంచి మొత్తం 16,845 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా వారిలో 16,693 మంది ఉత్తీర్ణులయ్యారు. సంస్థ మొత్తం 99.1% ఉత్తీర్ణతను నమోదు చేసింది. బాలికలు 99.36% తో పైచేయి సాధించగా, బాలురు 98.65% ఉత్తీర్ణత సాధించారు. వ్యక్తిగత ప్రతిభలో ఇస్లావత్ తిరుపతి 600కు 590 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలవగా, మంజుల (583), లహరి (583), వినయ్ కుమార్ (581), దుర్గం శివమణి (581), ప్రవీణ (580) మార్కులతో సత్తా చాటారు.

​హర్షం వ్యక్తం చేసిన సీఎం రేవంత్..

రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచడంలో సాంఘిక సంక్షేమ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యా సంస్కరణలకు ఈ ఫలితాలే నిదర్శనమని అభినందించారు. సాంఘిక సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ విజయాన్ని గురుకులాల చరిత్రలో ఒక మైలురాయిగా అభివర్ణించారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ విజయేంద్ర బోయి మాట్లాడుతూ విద్యార్థులకు, బోధనా సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.