కాంగ్రెస్ వైపు గుత్తా అమిత్ చూపు!?

కాంగ్రెస్ వైపు గుత్తా అమిత్ చూపు!?
  •      మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో రహస్య భేటీ
  •     భువనగిరి టికెట్ కోసమే అని ప్రచారం
  •     బీసీ నేతను బరిలోకి దించాలనుకుంటున్న అధిష్టానం
  •     హైకమాండ్ పరిశీలనలో నేతి విద్యాసాగర్ పేరు

నల్గొండ, వెలుగు: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి కాంగ్రెస్​లో చేరనున్నట్టు తెలిసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డితో ఆయన రహస్యంగా భేటీ అయ్యారు. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో డీలాపడిన బీఆర్ఎస్.. అమిత్ రెడ్డి కాంగ్రెస్​లో చేరుతారన్న ప్రచారంతో మరింత దెబ్బతిననున్నది. సోమవారం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు రెండు రోజుల నుంచి జిల్లా ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యేలతో పార్టీ హైకమాండ్ చర్చలు జరుపుతున్నది. 

ఇప్పటికే నలుగురు అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది. మిగిలిన స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు కసరత్తు చేస్తున్నది. హుజూర్​నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీజేపీలో చేరడం పార్టీని మరింత కుదిపేసింది. దీనికితోడు కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నియోజకవర్గంలో అడుగుపెట్టడమే మానేశారు.

భువనగిరి టికెట్ కోసం తీవ్ర పోటీ

నల్గొండ అభ్యర్థిగా రఘువీర్ రెడ్డిని ప్రకటించిన కాంగ్రెస్.. భువనగిరి స్థానాన్ని పెండింగ్​లో పెట్టింది. ఈ సెగ్మెంట్ ఇన్​చార్జ్​గా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. అభ్యర్థి ఎంపికలో మంత్రి ఒపీనియన్ కీలకం కానున్నది. భువనగిరి టికెట్ కోసం డాక్టర్ కోమటిరెడ్డి సూర్యపవన్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి మధ్య పోటీ నెలకొన్నది. బీసీ కోటా కింద శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ పేరు పరిశీలనలో ఉంది. ఇదే టైమ్​లో మంత్రి వెంకట్​రెడ్డితో అమిత్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకున్నది.

పార్టీ మారుతాననే ప్రచారంలో  నిజం లేదు: గుత్తా అమిత్ రెడ్డి

బీఆర్ఎస్ పార్టీ వీడుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని గుత్తా అమిత్ రెడ్డి స్పష్టం చేశారు. అవన్నీ కేవలం ఊహాగానాలే అని కొట్టిపారేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో భేటీ కావడం వాస్తవమే అన్నారు. కానీ.. పార్టీ మార్పు గురించి చర్చ జరగలేదన్నారు. తాజా రాజకీయ పరిస్థితులపైనే మాట్లాడుకున్నామని తెలిపారు. పార్టీ మారాల్సిన పరిస్థితి వస్తే అందరికీ చెప్పే వెళ్తానని అన్నారు. బీజేపీ నేతలు కూడా తనను సంప్రదించినట్టు వివరించారు.