పదవి ఊడుతుందని తెలిసే కేబినెట్ భేటీలు: GVL ఫైర్

పదవి ఊడుతుందని తెలిసే కేబినెట్ భేటీలు: GVL ఫైర్

ఢిల్లీ:  మే 23 తర్వాత ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం తుపాన్ లా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని బీజేపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు టిఆర్ఎస్ తో ఘర్షణకు దిగారని ఆయన అన్నారు. ప్రస్తుతం బాబు చేస్తున్న పోలవరం పర్యటనలు కూడా కాంట్రాక్టులో తన వాటా తనకు వచ్చిందో లేదో తెలుసుకోవడానికేనని జీవిఎల్ విమర్శించారు.

ఎన్నికల సంఘం అనుమతి లేకుండా క్యాబినెట్ మీటింగ్ పెట్టకూడదని, తన పదవి ఊడబోతొందని తెలిసే చంద్రబాబు క్యాబినెట్ మీటింగ్ అంటూ  హడావిడి చేస్తున్నారని ఆయన అన్నారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కూడా ఎన్నికల సంఘం అనుమతి తోనే స్పెషల్ కేబినెట్ మీటింగ్ పెట్టారని ఈ సందర్భంగా తెలిపారు. తన రాజకీయ ప్రయోజనాల కోసమే బాబు ఎన్నికల కమిషన్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని విమర్శించారు.

ఈ ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వానికి మెజారిటీ రాబోతోందని జీవిఎల్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ఫలించే అవకాశమే లేదని అన్నారు. తమ సంతానానికి రాష్ట్ర బాధ్యతలు అప్పగించి ఢిల్లీకి రావాలని చంద్రబాబు, కేసీఆర్ లు ఉబలాటపడుతున్నారన్నారు. తెలంగాణలో టీడీపీ అడ్రస్ లేకుండా పోయిందని, ఏపీలో కూడా ఆ పార్టీ చతికిలపడిందని ఆయన అన్నారు. 2024 కల్లా ఏపీ, తెలంగాణల్లో బీజేపీ నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుందన్నారు. ఈ రెండు రాష్ట్రాలను బిజెపికి కంచుకోటగా మారుస్తామని జీవిఎల్ తెలిపారు.