బీజేపీకి ఈసీ ఊడిగం.. జ్ఞానేశ్ వెంటనే తప్పుకోవాలి: వద్దిరాజు రవిచంద్ర

బీజేపీకి ఈసీ ఊడిగం.. జ్ఞానేశ్ వెంటనే తప్పుకోవాలి: వద్దిరాజు రవిచంద్ర

హైదరాబాద్, వెలుగు: స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం బీజేపీకి ఊడిగం చేస్తోందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు. బీజేపీ వ్యతిరేక ఓట్లను సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగిస్తున్నారని, ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

శుక్రవారం ఆయన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి తెలంగాణభవన్ లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సర్వే పేరిట 95 లక్షల ఓట్లు తొలగించారని, సీఈసీ ఓ ప్రైవేటు సంస్థను ఆశ్రయించి ఓట్లను విచ్చలవిడిగా తొలగించారని ఆరోపించారు. తొలగించిన ఓట్లను తిరిగి జాబితాలో చేర్చకపోవడంపై మండిపడ్డారు.

ఓట్లు తొలగించడం వల్ల బీజేపీ మాత్రమే లబ్ది పొందిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మోదీ, అమిత్ షాతో ఎన్నికల సంఘం కుమ్మక్కై బీజేపీని గెలిపించిందని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్ లో ఈవీఎంలను అడ్డుపెట్టుకుని బీజేపీ గెలిచిందని, బెంగాల్ ఎన్నికల వెంటనే 4 వేల ఈవీఎంలను కాల్చివేయడంతో కుట్ర బయటపడిందన్నారు. జ్ఞానేశ్ కుమార్ ను పదవి నుంచి తొలగించడంతో పాటు అరెస్ట్ చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.