జీడిమెట్ల, వెలుగు: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి తాను ఉంటున్న ఇంట్లోనే మంటల్లో సజీవ దహనమయ్యాడు. హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. కూకట్‌పల్లిలోని కమలా ప్రసన్ననగర్కు చెందిన టి.జయకృష్ణ (32) జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో తాను ఉంటున్న ప్లాట్‌లో మంటలు ఎగసిపడ్డాయి. చుట్టుపక్కలవాళ్లు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. .
వాళ్లు స్పాట్‌కు వచ్చి మంటలు అదుపుచేశారు. అప్పటికే జయకృష్ణ మంటల్లో సజీవ దహనమయ్యాడు. కాగా, ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భార్య వారం రోజుల కింద ఊరెళ్లడంతో జయకృష్ణ తన ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పార్టీ తర్వాత ఫ్రెండ్స్ బయటకు వెళ్లారని, అరగంటలో వాళ్లు తిరిగి వచ్చేలోగా అగ్నిప్రమాదం జరగడం, అతడు మంటల్లో కాలిపోవడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్లాన్ ప్రకారమే ఎవరైనా చంపేశారా? లేక సూసైడ్ చేసుకున్నాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.