హైదరాబాద్: హైదరాబాద్ సిటీలోని వనస్థలిపురంలో బుధవారం సాయంత్రం వడగండ్ల వర్షం కురిసింది. పీర్జాది గూడ, బోడుప్పల్,ఉప్పల్ ప్రాంతాలలో కూడా వాన పడింది. ఎల్బీనగర్, నాగోల్, హయత్ నగర్ ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది.
హైదరాబాద్ సిటీలో రాగల రెండు, మూడు గంటలు మోస్తరు వర్షం కురుస్తుందని.. అక్కడక్కడా వడగండ్ల వాన కురుస్తుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. మంగళవారం సాయంత్రం కూడా అకాల వర్షం బీభత్సం సృష్టించింది. వడగండ్ల వానతో ఐటీ కారిడార్ అతలాకుతలం అయ్యింది. ఈదురు గాలుల ధాటికి 21 చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఆఫీసులు వదిలే సమయం కావడంతో హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్ పరిధిలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. కృష్ణానగర్ వంటి లోతట్టు ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపించగా, వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. క్యాబ్‌లు, ఆటోలు బుక్ కాకపోవడం, పలువురు భారీగా వసూలు చేయడంతో ఐటీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు అర్ధరాత్రి వరకు శ్రమించి కూలిన చెట్లను తొలగించారు. గ్రేటర్లో మరో మూడ్రోజులు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టం చేయడంతో నగర ప్రజలు అలర్ట్గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
►ALSO READ | పెట్రోల్ కోసం వర్రీ ఎందుకు.. హైదరాబాదీలకు ఆర్టీసీ బంపర్ ఆఫర్!
రాబోయే రెండు మూడు గంటల పాటు వర్ష సూచన:
* తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షం నేపథ్యంలో హెచ్చరికలు జారీ
* వర్షాలతో వచ్చే రెండు మూడు (4 to7) గంటల పాటు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ జారీ చేసిన ఐఎండీ
* రంగారెడ్డి జిల్లాకు రాబోయే రెండు మూడు గంటల పాటు రెడ్ అలర్ట్
* రంగారెడ్డి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షం ఈదురుగాల్ల తీవ్రత అధికంగా ఉండడంతో రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ అధికారులు
* హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మంచిర్యాల, కొమరం భీం అసిఫాబాద్, నారాయపేట, వికారాబాద్ జిల్లాకు మోస్తారు వర్ష సూచనతో ఆరెంజ్ అలర్ట్
* నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు తేలికపాటి వర్ష సూచనతో ఎల్లో అలర్ట్
