పెట్రోల్ కోసం వర్రీ ఎందుకు.. హైదరాబాదీలకు ఆర్టీసీ బంపర్ ఆఫర్!

పెట్రోల్ కోసం వర్రీ ఎందుకు.. హైదరాబాదీలకు ఆర్టీసీ బంపర్ ఆఫర్!

పెట్రోల్ కొరతతో ఇబ్బందులు పడుతున్న నగరవాసులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. బంకుల్లో నో పెట్రోల్  బోర్డులు వెలసిన క్రమంలో.. ప్రయాణికులకు  బంపర్ ఆఫర్ ప్రకటించింది. పెట్రోల్ కష్టాలు పడటం ఎందుకు దండగ.. ఆర్టీసీ బస్సులు ఉండగా..! అంటూ వినూత్న ప్రచారాన్ని ప్రారంభించింది. 

హైదరాబాద్ పరిధిలో మెట్రో ఏసీ, డీలక్స్ బస్సుల్లో ప్రయాణికులకు 30% డిస్కౌంట్ ఇస్‌తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ వీసీ & ఎండీ శ్రీ వై. నాగిరెడ్డి ఐపీఎస్ తెలిపారు. బంకుల వద్ద బారులు తీరొద్దు... సేఫ్ గా బస్ ఎక్కండి... సుఖవంతమైన ప్రయాణం చెయ్యండి అంటూ ప్రకటన విడుదల చేశారు. 

ప్రస్తుత యుద్ధ వాతావరణంలో తలెత్తిన ఇంధన కొరత దృష్ట్యా, నగర వాహనదారులకు ఆర్టీసీ బస్సులను వినియోగించుకుని గమ్యస్థలాలకు చేరుకోవాలని సూచించారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న నాలుగు ప్రధాన ప్రయోజనాలను ఆయన వివరించారు. అవి:

  • సమయం, ఇంధనం ఆదా ... క్యూ లైన్లకు స్వస్తి:

పెట్రోల్ కోసం కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిలబడి విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని ఎండీ నాగిరెడ్డి సూచించారు. సొంత వాహనాల కోసం గంటల తరబడి వేచి చూసే బదులు, క్షేమంగా, వేగంగా గమ్యస్థానాలకు చేరడానికి ఆర్టీసీ బస్సులే మేలని పేర్కొన్నారు.

  • ఇంధన పొదుపు - దేశాభివృద్ధికి మలుపు:

ఇంధన సంక్షోభం నెలకొన్న తరుణంలో ప్రతి చుక్క పెట్రోల్ విలువైనదే. వ్యక్తిగత వాహనాలను పక్కన పెట్టి ప్రజా రవాణాను ఆశ్రయించడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేయవచ్చని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా తోడ్పడుతుందని ఆయన తెలిపారు.

పర్యావరణానికి మేలు - కాలుష్య రహిత ప్రయాణం:

రోడ్లపై వాహనాల రద్దీ తగ్గడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తీరడమే కాకుండా, కాలుష్యం కూడా తగ్గుతుంది. ముఖ్యంగా ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆయన కోరారు.

  • జేబుకు హాయి - ప్రయాణం సుఖవంతం: 

సాధారణంగా ఏసీ బస్సులు ఖరీదు అనుకునే వారికి 30% రాయితీ ఒక గొప్ప అవకాశం. పెట్రోల్ ధరల సెగ నుంచి తప్పించుకుని, అతి తక్కువ ధరకే లగ్జరీ ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. ఇది సామాన్యుడి జేబుకు, ప్రయాణానికి ఎంతో హాయినిస్తుందని పేర్కొన్నారు.