గ్రామాల్లో వీధి దీపాల బాధ్యతలు సర్పంచులకే అప్పగించండి: సీఎం రేవంత్

గ్రామాల్లో వీధి దీపాల బాధ్యతలు సర్పంచులకే అప్పగించండి: సీఎం రేవంత్

హైదరాబాద్: రాష్ట్ర మంతా ఎల్ఈడీ వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటు, వాటి నిర్వహణ బాధ్యతలను సర్పంచులకే అప్పగించాలని చెప్పారు. గ్రామాల్లో అవసరమైనన్ని కొత్త ఎల్ఈడీ లైట్లను అమర్చటంతో పాటు వాటిని సమర్థంగా నిర్వహించే అధికారం గ్రామ పంచాయతీల పరిధిలోనే ఉండాలని స్పష్టం చేశారు.

సోమవారం (సెప్టెంబర్ 15) పంచాయతీ రాజ్, మున్సిపల్, జీహెచ్ఎంసీ విభాగాలకు సంబంధించి ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో  సీఎం రేవంత్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వీధి దీపాలకు సంబంధించి గ్రామాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న LED లైట్లు వెలుగుతున్నాయా లేదా, కొత్తగా ఎన్ని అవసరం ఉన్నాయో పక్కాగా అంచనా వేయాలని, ప్రతి పోల్ లెక్కించేలా సర్వే చేయాలని పంచాయతీ రాజ్ శాఖ అధికారులను ఆదేశించారు.

రాత్రి పూట ఎల్ఈడీ లైట్లు పని చేయటంతో పాటు పగటిపూట దుర్వినియోగం కాకుండా పర్యవేక్షణ ఉండాలని, అన్ని గ్రామాల ఎల్ఈడీ డ్యాష్‌బోర్డు మండల స్థాయిలో ఎంపీడీవో పర్యవేక్షణలో ఉండాలని చెప్పారు. జిల్లాలో అడిషనల్ కలెక్టర్‌కు ఈ బాధ్యతలు అప్పగించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల పరిధిలో 16.16 లక్షల ఎల్ఈడీ లైట్లున్నాయని, వరంగల్, నల్గొండ, జనగాం, నారాయణపేట జిల్లాల్లో ఎల్ఈడీ లైట్ల కాంట్రాక్టు ఏజెన్సీ ఆధ్వర్యంలో ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అన్ని గ్రామాల్లో సర్పంచులకే వీటిని అప్పగిస్తే.. లైట్ల నిర్వహణ, విద్యుత్తు దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ALSO READ : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం

రాష్ట్రంలో అన్ని ఎల్ఈడీ లైట్లను హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 5.50 లక్షల ఎల్ఈడీ లైట్లు ఉన్నాయని, అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ సిటీని కూడా కలిపితే మొత్తం 7.50 లక్షల లైట్లు అవసరమవుతాయని మున్సిపల్ శాఖ నివేదించింది. కోర్ అర్బన్ సిటీ పరిధిలో జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా చేరిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఎల్ఈడీ లైట్ల అవసరాన్ని అంచనా వేయాలని చెప్పారు. కొత్తగా ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు, నిర్వహణకు టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. 

ఎల్ఈడీ లైట్ల తయారీలో పేరొందిన కంపెనీలను ఆహ్వానించాలని, ఏడేండ్ల పాటు నిర్వహణ బాధ్యతలు కంపెనీలకు అప్పగించాలని, నిర్వహణ పక్కగా ఉండేందుకు వీలుగా టెండర్ నిబంధనలను రూపొందించాలని చెప్పారు. ఎల్ఈడీ లైట్లతో పాటు కంట్రోల్ బాక్స్‌ల ఏర్పాటు, వాటి పనితీరును నిరంతరం పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా వ్యవస్థ ఉండాలన్నారు. హైదరాబాద్ ఐఐటీ లాంటి సంస్థలతో థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలని సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో వీధి దీపాలకు ప్రతి నెలా రూ. 8 కోట్ల కరెంటు బిల్లు అవుతున్నందున, సోలార్ పవర్ వినియోగించే అంశాన్ని, అందుకు అవసరమైన సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం సూచించారు.