వదినపై న్యాయపోరాటానికి దిగిన హన్సిక .. రూ. 2 కోట్ల పరువు నష్టం దావా.. ఎందుకంటే?

వదినపై న్యాయపోరాటానికి దిగిన హన్సిక .. రూ. 2 కోట్ల పరువు నష్టం దావా.. ఎందుకంటే?

టాలీవుడ్ 'దేశముదురు' బ్యూటీ హన్సిక మోత్వాని మరో సారి వార్తల్లో నిలిచారు. కుటుంబ వివాదాలు, వరుస కోర్టు కేసులతో న్యాయపరమైన వివాదంలో చిక్కుకున్నారు .  తన వదిన, టెలివిజన్ నటి ముస్కాన్ నాన్సీ జేమ్స్ హన్సికపై గృహహింస ఆరోపణలు చేస్తూ కేసు వేసింది. ఈ ఆరోపణలను హన్సిక తీవ్రంగా ఖండించింది. తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు గానూ ముస్కాన్ పై రూ. 2 కోట్ల పరువు నష్టం దావా వేస్తూ ముంబై సెషన్స్ కోర్టును ఆశ్రయించారు.

వివాదానికి కారణమేంటి?

హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వాని, ముస్కాన్ నాన్సీ జేమ్స్ 2020లో వివాహం చేసుకున్నారు. అయితే, 2022 నుండి వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో, హన్సిక, ఆమె కుటుంబ సభ్యులు తనను శారీరక, మానసిక వేధింపులకు గురిచేశారని ముస్కాన్ గతంలో ఎఫ్.ఐ.ఆర్ (FIR) నమోదు చేశారు. పెళ్లి సమయంలో ఖరీదైన కానుకలు అడిగారని, తన వైవాహిక జీవితంలో హన్సిక జోక్యం చేసుకునేదని ఆమె ఆరోపించారు. ఈ ఒత్తిడి కారణంగానే తనకు ముఖ పక్షవాతం వచ్చిందని ముస్కాన్ పేర్కొనడం సంచలనం సృష్టించింది.

అప్పు కట్టలేకనే ఈ డ్రామా!

అడ్వకేట్ అద్నాన్ షేక్ ద్వారా హన్సిక దాఖలు చేసిన పిటిషన్‌లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముస్కాన్ గతంలో తన వద్ద రూ. 27 లక్షలు అప్పు తీసుకున్నారని, ఆ డబ్బు తిరిగి చెల్లించమని అడిగినందుకే ఈ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని హన్సిక పేర్కొన్నారు. తను తన సోదరుడితో కలిసి ఉండటం లేదని, 2022లో తన వివాహం జరిగినప్పటి నుండి తన భర్తతో విడిగా ఉంటున్నానని, అలాంటప్పుడు గృహహింసకు పాల్పడే అవకాశం ఎక్కడిదని ఆమె ప్రశ్నించారు. కేవలం సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసం ,అప్పు ఎగ్గొట్టడానికే ముస్కాన్ ఇలాంటి ప్రతీకార చర్యకు దిగిందని హన్సిక ఆరోపించారు.

కోర్టు మధ్యంతర ఆదేశాలు

ఈ కేసును విచారించిన కోర్టు కీలక ఆదాశాలు జారీ చేసింది. హన్సికపై సోషల్ మీడియాలో గానీ, మరెక్కడా గానీ ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని ముస్కాన్‌ను ఆదేశిస్తూ రెస్ట్రైనింగ్ ఆర్డర్ జారీ చేసింది. అలాగే బహిరంగ క్షమాపణ చెప్పాలని హన్సిక తన పిటిషన్‌లో కోరారు.

వ్యక్తిగత జీవితంలో మరో కుదుపు

వరుస కోర్టు కేసుల మధ్య హన్సిక వ్యక్తిగత జీవితంలో మరో వార్త బయటకు వచ్చింది. 2022లో అట్టహాసంగా వ్యాపారవేత్త సోహైల్ కతూరియాను వివాహం చేసుకున్న హన్సిక.. మార్చి 11, 2026న ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు. పరస్పర అంగీకారంతోనే వీరిద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. ఒకవైపు వదినతో న్యాయపోరాటం, మరోవైపు విడాకుల వ్యవహారంతో హన్సిక ప్రస్తుతం తన జీవితంలో అత్యంత కఠినమైన దశను ఎదుర్కొంటున్నారు.