- హనుమకొండ నుంచి పస్రాకు 3 గంటలు, అక్కడి నుంచి మేడారానికి 10 గంటలు
- ట్రాఫిక్ నిలిచిపోవడంతో అర్ధరాత్రి అడవిలో చలికి ఇబ్బంది పడిన జనం
- ఆగ్రహంతో బస్సు అద్దాలు పగులగొట్టిన ప్రయాణికులు
వరంగల్/ములుగు/తాడ్వాయి, వెలుగు: మేడారం జాతరకు వచ్చిపోయే రూట్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. మూడు లైన్లు కూడా వాహనాలతో కిక్కిరిసిపోవడంతో గంటలపాటు జనం రోడ్లపైనే గడపాల్సి వచ్చింది. వరంగల్, హనుమకొండ నుంచి ఆర్టీసీ బస్సుల్లో బయలుదేరిన భక్తులు 13 గంటలు దట్టమైన అటవీ ప్రాంతంలో చలికి వణికిపోయారు. తిండి, నీళ్లు లేకపోవడంతో పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కేవలం 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం వెళ్లడానికి 10 గంటల పాటు బస్సుల్లోనే కూర్చోవాల్సి వచ్చిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
వరంగల్, హనుమకొండ నుంచి మేడారానికి సుమారు 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇంత దూరం ప్రయాణించేందుకు సాధారణంగా మూడు గంటలు పడుతుంది. కాగా, మేడారం జాతరలో భాగంగా బుధ, గురువారాల్లో గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క, సారలమ్మ శనివారం తిరిగి వనప్రవేశం చేయనుండడంతో దర్శనం చేసుకునేంతుకు భక్తులు భారీ సంఖ్యలో బయల్దేరారు. హనుమకొండ, వరంగల్ బస్టాండ్ల నుంచి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు బస్సు ఎక్కిన భక్తులు మేడారం చేరుకునేటప్పటికి శనివారం ఉదయం ఏడు అయింది.
వరంగల్ మీదుగా 100 కిలోమీటర్ల ప్రయాణంలో.. 70 కిలోమీటర్ల దూరం వరకు మూడు గంటల్లోపే వెళ్లినా.. అక్కడి నుంచి తాడ్వాయి మీదుగా.. 20 నుంచి 30 కిలోమీటర్లు వెళ్లేందుకు10 గంటలు పట్టింది. దీంతో రాత్రికి రాత్రి తల్లుల దర్శనం చేసుకుని తెల్లారే వరకు మళ్లీ ఇంటికి చేరుకోవాలని భావించిన భక్తులు ట్రాఫిక్ జామ్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అడ్డదిడ్డంగా బస్సుల పార్కింగ్
ప్రయాణికుల కోసం ఆర్టీసీ ఆధ్వర్యంలో మేడారంలో తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేశారు. తాడ్వాయి మీదుగా వన్ వే ఏర్పాటు చేసి మేడారం బస్టాండ్‌లోకి బస్సులు ఎలా రావాలి.. ఎలా బయటకు వెళ్లాలో ప్లాన్ చేశారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణను పోలీసులకు అప్పగించారు. అయితే శుక్రవారం తల్లుల దర్శనం తర్వాత ప్రయాణికులు తిరిగి వెళ్లే టైమ్‌లో బస్టాండ్‌లో బస్సులను అడ్డదిడ్డంగా పార్కింగ్ చేశారు. దీంతో పస్రా, తాడ్వాయి మీదుగా బస్టాండ్‌లోకి రావాల్సిన బస్సులు లోపలికి రాలేక ఎంట్రెన్స్ వద్దే ఆగిపోయాయి. ఇలా ఒకదాని వెనుక మరొకటి వందల బస్సులు నిలిచిపోయాయి. దీనికి తోడు జంపన్నవాగు, నార్లాపూర్, చింతల్‌క్రాస్ మీదుగా పస్రా నేషనల్ హైవేకు చేరిన ప్రైవేట్ వాహనాలకు పస్రా వద్ద ఆర్టీసీ బస్సుల ట్రాఫిక్ తోడవడంతో భక్తులకు చుక్కలు కన్పించాయి.
పస్రా రూట్లో డైవర్షన్ పెట్టి ట్రాఫిక్ క్లియర్
మేడారం మహాజాతరలో గతానికి భిన్నంగా పది గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో శనివారం ఉదయం పలు చోట్ల ట్రాఫిక్ డైవర్షన్ పెట్టారు. ఆర్టీసీ బస్సుల కారణంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోవడంతో.. బస్సులను తాడ్వాయితో పాటు మేడారం ఆర్టీసీ జంక్షన్ నుంచి చింతల్ క్రాస్ వయా నార్లాపూర్, పస్రా మీదుగా.. నేషనన్ హైవేకు కలిపి.. హనుమకొండ, వరంగల్ వైపు వెళ్లాల్సిన వాహనాలకు రూట్ క్లియర్ చేశారు. దీంతో శనివారం మధ్యాహ్నం దాటాక ట్రాఫిక్ క్లియర్ అయింది.
అద్దాలు పగులగొట్టిన జనాలు
మేడారం రూట్‌లో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో.. మేడారం నుంచి తిరిగి వెళ్లే భక్తులు బస్టాండ్‌లో, తల్లుల దర్శనం కోసం మేడారం వచ్చే భక్తులు అడవీ ప్రాంతంలో గంటల తరబడి చిక్కుకుపోయారు. దీంతో ఆగ్రహానికి గురైన భక్తులు డ్యూటీల్లో ఉన్న ఆర్టీసీ ఆఫీసర్లు, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు బస్సు అద్దాలను పగులగొట్టారు. కాగా, జాతర సక్సెస్ కోసం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ధనసరి సీతక్క, పొన్నం ప్రభాకర్‍తో పాటు ఉన్నతాధికారులు ఆర్టీసీ, పోలీస్ ఆఫీసర్లతో సమావేశాలు నిర్వహించినా.. ఇరు శాఖల కోఆర్డినేషన్ లేకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తప్పలేదు.
