సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్​ను మెచ్చుకున్న ప్రధాని నరేంద్ర మోడీ

సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్​ను మెచ్చుకున్న ప్రధాని నరేంద్ర మోడీ

సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్​ను ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చుకున్నారు. హరిప్రసాద్ జీ20 సదస్సు లోగోను కాటన్ బట్టపై నేసి ప్రధానికి పంపగా.. దాని గురించి ఆదివారం ‘‘మన్ కీ బాత్”లో మోడీ ప్రస్తావించారు. హరిప్రసాద్ ప్రతిభ, ఆయన పంపిన బహుమతి అద్భుతంగా ఉందన్నారు. ఆ బహుమతి చూసి ఆశ్చర్యపోయానని, ఆయన కళ అందరి దృష్టిని ఆకర్షిస్తోందన్నారు. తెలంగాణలోని ఒక జిల్లాలో కూర్చున్న వ్యక్తి కూడా జీ-20 వంటి శిఖరాగ్ర సదస్సుతో ఎంతగా అనుసంధానమయ్యాడో చూసి  చాలా సంతోషించానన్నారు.

న్యూఢిల్లీ/రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. హరిప్రసాద్ జీ20 సదస్సు లోగోను కాటన్ బట్టపై నేసి ప్రధానికి పంపగా.. దాని గురించి ఆదివారం ‘‘మన్ కీ బాత్” కార్యక్రమంలో మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. హరిప్రసాద్ ప్రతిభను, ఆయన పంపిన బహుమతి అద్భుతంగా ఉందంటూ మెచ్చుకున్నారు. ‘‘మిత్రులారా.. ఇయ్యాల్టి కార్యక్రమాన్ని ఒక ప్రత్యేకమైన బహుమతి గురించి ప్రస్తావిస్తూ ప్రారంభిస్తున్నాను. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నేతన్న వెల్ది హరిప్రసాద్.. చేతితో నేసిన జీ-20 లోగోను నాకు పంపించారు. ఈ అద్భుతమైన బహుమతి చూసి నేను ఆశ్చర్యపోయాను. హరిప్రసాద్ కళలో అందరి దృష్టిని ఆకర్షించే నైపుణ్యం ఉంది. చేతితో నేసిన జీ-20 లోగోతో పాటు హరిప్రసాద్ నాకు ఒక లేఖ కూడా పంపారు.

వచ్చే ఏడాది జీ-20 సదస్సుకు మనదేశం ఆతిథ్యమివ్వడం గర్వించదగ్గ విషయమని అందులో రాశారు. దేశం సాధించిన ఈ విజయం నుంచి పొందిన స్ఫూర్తితో ఆయన జీ20 లోగోను తన చేతులతో నేశారు. తన తండ్రి నుంచి ఈ అద్భుతమైన కళా ప్రతిభను వారసత్వంగా పొందారు. హరిప్రసాద్ పంపిన ఈ బహుమతి అందుకోగానే నా మనసులో మరో ఆలోచన వచ్చింది. తెలంగాణలోని ఒక జిల్లాలో కూర్చున్న వ్యక్తి కూడా జీ-20 వంటి శిఖరాగ్ర సదస్సుతో ఎంతగా అనుసంధానమయ్యాడో చూసి నేను చాలా సంతోషించాను. ఇంత పెద్ద సమిట్‌‌‌‌‌‌‌‌ను మన దేశం నిర్వహిస్తుండడంతో హరిప్రసాద్‌‌‌‌‌‌‌‌ లాంటి చాలా మంది నాకు లేఖలు పంపారు” అని ప్రధాని చెప్పారు. ఇటీవల తాను జీ-20 లోగోను, ప్రెసిడెన్సీ ఆఫ్ ఇండియా వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించానని ఆయన గుర్తు చేశారు.  

జీ20 ప్రెసిడెన్సీకి రెడీ 

శక్తిమంతమైన ‘జీ20’ ప్రెసిడెన్సీని చేపట్టేందుకు ఇండియా సిద్ధంగా ఉందని మోడీ అన్నారు. జీ20 ప్రెసిడెన్సీ హయాంలో ప్రపంచ ప్రయోజనాలపై ఫోకస్ చేస్తామని చెప్పారు. శాంతి, ఐక్యత, పర్యావరణం, సుస్థిర అభివృద్ధి తదితర సవాళ్లకు తమ దగ్గర పరిష్కారాలు ఉన్నాయని తెలిపారు. ‘‘జీ20 ప్రెసిడెన్సీ.. ఇండియాకు పెద్ద అవకాశం. ‘ఒక భూమి.. ఒక కుటుంబం.. ఒక భవిష్యత్’ అనే థీమ్‌‌‌‌‌‌‌‌ను ఇండియా ఇచ్చింది. ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతులు.. ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం.. ప్రపంచ జీడీపీలో 85 శాతం జీ20లోనే ఉంది. భారతదేశం ఇంత పెద్ద, శక్తివంతమైన గ్రూప్‌‌‌‌‌‌‌‌నకు డిసెంబర్ 1 నుంచి అధ్యక్షత వహించబోతున్నది” అని పేర్కొన్నారు.

జీ20 సమిట్‌‌‌‌‌‌‌‌లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి అతిథులు వస్తారు. మీ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. అప్పుడు మీరు మీ సంస్కృతిలోని విభిన్నమైన, విలక్షణమైన రంగులను ప్రపంచానికి చూపిస్తారని నేను అనుకుంటున్నా. జీ20 కోసం వాళ్లు ప్రతినిధులుగా వస్తున్నా.. భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో మనకు టూరిస్టులు అవుతారు” అని చెప్పారు. 

విక్రమ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌తో కొత్త చరిత్ర

దేశంలో ప్రైవేట్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తయారు చేసి, ప్రయోగించిన తొలి రాకెట్ ‘విక్రమ్-ఎస్’ గురించి మోడీ ప్రస్తావించారు. స్వదేశీ స్పేస్ స్టార్టప్ నుంచి వచ్చిన మొదటి రాకెట్‌‌‌‌‌‌‌‌ను శ్రీహరికోట నుంచి అంతరిక్షంలోకి పంపామని, దీంతో ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో ఉప్పొంగిందని అన్నారు. ఈ ప్రయోగం కొత్త యుగానికి నాంది పలికిందని, కొత్త చరిత్రను లిఖించిందని చెప్పారు. 
హరిప్రసాద్ చీరలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ చేనేత కళాకారుడు హరిప్రసాద్ తన ప్రతిభతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. గతంలో అగ్గిపెట్టెలో పట్టే చీరను నేశాడు. తానే సొంతంగా తయారు చేసిన బట్టపై అనేక మంది లీడర్ల ఫొటోలు ముద్రించాడు.

ఇటీవల ఆయన తయారు చేసిన పట్టు చీరలకు ‘‘రాజన్న సిరిపట్టు” అని పేరు పెట్టి దేశ విదేశాల్లో అమ్ముతున్నారు. హరిప్రసాద్ చేతితో పట్టు చీరలను నేయడంతో పాటు కంప్యూటర్ సాయంతో కాటన్, పాలిస్టర్ కలిసిన బట్టతో కొత్త డిజైన్ల చీరలను తయారు చేస్తున్నాడు. నాలుగేండ్ల క్రితం సిరిసిల్లలో బతుకమ్మ చీరల తయారీ ప్రారంభించినప్పుడు న్యూజిలాండ్ బ్రాండ్ అంబాసిడర్ సునీతా విజయ్ రాష్ట్రానికి వచ్చారు. హరిప్రసాద్ తయారు చేసే చీరలను పరిశీలించారు. ఆయనతో పట్టు చీరను తయారు చేయించి న్యూజిలాండ్ లో మార్కెటింగ్​ చేయించారు. ప్రస్తుతం హరిప్రసాద్ తయారు చేస్తున్న చీరలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్​ఏర్పడింది.

నా జీవితంలోనే గొప్ప ప్రశంస.. 

ప్రధాని మోడీ ప్రశంస నాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. నేను పంపిన జీ20 లోగో గురించి ప్రధాని ‘‘మన్ కీ బాత్’’ లో మాట్లాడతారని అనుకోలేదు. కానీ ఆయన నన్ను దేశ ప్రజలకు పరిచయం చేసి అభినందనలు తెలపడంతో చాలా సంతోషం కలిగింది. నా  జీవితంలో ఇంతకంటే గొప్ప ప్రశంస ఇంకేదీ ఉండదు. ప్రధాని మెచ్చుకోవడంతో మరిన్ని ప్రయోగాలు చేసేందుకు ప్రేరణ కలిగింది. - హరిప్రసాద్, చేనేత కళాకారుడు