మా పార్టీ లీడర్ల ఫోన్లు హ్యాక్ చేస్తున్రు.. తప్పు చేసిన ఐపీఎస్ ఆఫీసర్లు రిటైర్డ్‌‌ అయినా వదిలిపెట్టం : హరీశ్‌‌రావు

మా  పార్టీ లీడర్ల ఫోన్లు హ్యాక్ చేస్తున్రు.. తప్పు చేసిన ఐపీఎస్ ఆఫీసర్లు రిటైర్డ్‌‌ అయినా వదిలిపెట్టం : హరీశ్‌‌రావు

సంగారెడ్డి, వెలుగు : కాంగ్రెస్‌‌ ప్రభుత్వం బీఆర్‌‌ఎస్‌‌ నేతల ఫోన్లు హ్యాక్‌‌ చేయిస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌రావు ఆరోపించారు. బెంగళూరు నుంచి హ్యాకర్లను తీసుకొచ్చి కమాండ్‌‌ కంట్రోల్‌‌ రూమ్‌‌లో కూర్చోబెట్టి బీఆర్ఎస్ నేతల ఫోన్లు, వారి ఇండ్ల ముందున్న సీసీ కెమెరాలను హ్యాక్‌‌ చేయిస్తున్నారన్నారు. 

సంగారెడ్డి జిల్లా కందిలోని జైలులో రిమాండ్‌‌లో ఉన్న బీఆర్‌‌ఎస్‌‌ సోషల్‌‌ మీడియా కన్వీనర్‌‌ క్రిశాంక్‌‌, మరో ఏడుగురు కార్యకర్తలను మంగళవారం హరీశ్‌‌రావు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘హ్యాకింగ్‌‌కు సంబంధించి మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఐపీఎస్‌‌ ఆఫీసర్లు రిటైర్డ్‌‌ అయినా సరే.. మేము అధికారంలోకి వచ్చాక వారిని వదిలిపెట్టం, కచ్చితంగా విచారణ జరిపిస్తాం, చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న అధికారులకు మూల్యం తప్పదు, అప్పుడు మిమ్మల్ని రేవంత్‌‌రెడ్డి కూడా కాపాడలేడు’ అని హెచ్చరించారు. 

ఫేక్‌‌ పోస్టులు పెట్టిన వారిని వదిలేసి, ఆధారాలతో ఫిర్యాదు చేసిన క్రిశాంక్‌‌ను అరెస్ట్‌‌ చేయడం కాంగ్రెస్‌‌ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యే అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు, సిట్‌‌లతో అణచివేసే కుట్ర జరుగుతోందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు పౌరులకు లేదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో సంగారెడ్డి, జహీరాబాద్‌‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ పాల్గొన్నారు.