హ్యామ్ రోడ్లలో భారీగా అవినీతి..25 శాతం ఎక్సెస్ తో టెండర్లు : హరీశ్రావు

హ్యామ్ రోడ్లలో భారీగా అవినీతి..25 శాతం ఎక్సెస్ తో టెండర్లు : హరీశ్రావు

హైదరాబాద్, వెలుగు: హ్యామ్​రోడ్లలో భారీగా అవినీతి జరుగుతోందని ఎమ్మెల్యే హరీశ్​రావు ఆరోపించారు. ఆర్అండ్​బీ, పంచాయతీరాజ్​శాఖల్లో టెండర్లను 25 శాతం ఎక్సెస్​తో కోట్ చేశారన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్​లో ఆయన మీడియాతో చిట్ చాట్​చేశారు. ఒక కంపెనీ ఏకంగా 75 శాతం ఎక్సెస్​కు టెండర్​వేసిందని చెప్పారు. ఆర్అండ్​బీలో రూ.11 వేల కోట్లతో టెండర్లు పిలిస్తే.. అదనంగా కలిపి రూ.15 వేల కోట్ల వరకు పోయిందని, పంచాయతీరాజ్​ శాఖలో రూ.6 వేల కోట్లకు పిలిస్తే రూ.7 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్ల వరకు ఎక్కువకు పోయిందని పేర్కొన్నారు.

దీనివల్ల రూ.5 వేల కోట్లు ప్రభుత్వంపై భారం పడుతోందని తెలిపారు. హ్యామ్​మోడల్​లో 40 శాతం ప్రభుత్వం, 60 శాతం ప్రైవేట్​భాగస్వామ్యంతో రోడ్లు వేస్తారని చెప్పారు. కానీ, ఆ 60 శాతం అమౌంట్​నూ బ్యాంకు నుంచి అప్పు తెచ్చి 30 ఇన్​స్టాల్​మెంట్లలో 15 ఏండ్లు ప్రభుత్వమే చెల్లించేందుకు సిద్ధమైందన్నారు. ఈ టెండర్లలో 10 శాతం మొబిలైజేషన్​అడ్వాన్సులు ఇచ్చేందుకు సర్కారు రెడీ అయిందని ఆరోపించారు.

వచ్చిన టెండర్లలో ఒక్క కంపెనీకే 15 టెండర్లు దక్కాయన్నారు. అధికారులకు ఎక్స్​టెన్షన్​ఇస్తే నాడు తమపై దుమ్మెత్తిపోసిన రేవంత్​రెడ్డి.. ఇప్పుడు రిటైరైన ఆఫీసర్లకు ఎక్స్​టెన్షన్​ఇస్తున్నారని, వారితో అక్రమ మార్గంలో టెండర్ల ప్రక్రియ చేపడుతున్నారని విమర్శించారు. ఆర్అండ్​బీ సీఈ వెంకటేశ్వరరావు, పంచాయతీరాజ్​సీఈ జోగారెడ్డి పదవీ కాలం పెంచారని, ఇరిగేషన్​ఈఎన్​సీకి ఎక్స్​టెన్షన్​ఇచ్చారన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వంలో అడ్వైజర్లు కూడా ఉండరని చెప్పిన సీఎం.. కాంగ్రెస్​అధికారంలోకి వచ్చాక 10 మంది అడ్వైజర్లను నియమించారని మండిపడ్డారు.