- జూపల్లికి పౌరుషం ఉంటే మంత్రి పదవికి రాజీనామా చెయ్యాలి
- మంత్రులు పొన్నం, అడ్లూరి, అజారుద్దీన్‌కు ఫోన్ చేసినా ఎత్తలేదని మండిపాటు
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం సవాళ్లు విసిరి చివరకు సైలెంట్ అయ్యారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విమర్శించారు. గోల్ కొడతామనుకుని సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారన్నారు. రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారని నిరూపించేందుకు తెలంగాణభవన్ వస్తానన్న మంత్రి జూపల్లి కృష్ణారావు.. తాను, కేటీఆర్ వచ్చినా రాలేదని అన్నారు. ఆయనకు పాలమూరు పౌరుషం ఉంటే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
గురువారం హరీశ్ తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. అంతకుముందు జూపల్లితో చర్చకోసం తెలంగాణభవన్‌కు వచ్చిన ఆయన.. గురుకులాల అక్రమాల ఆరోపణలపై మంత్రులతో చర్చించేందుకు గన్‌పార్క్‌కు బయల్దేరారు. ఆయన్ను పోలీసులు అడ్డుకుని కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం తెలంగాణభవన్ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘గురుకుల టెండర్లలో అవకతవకలు జరిగాయని నేను, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, కొప్పుల ఈశ్వర్ ఆధారాలతో మాట్లాడినం.
దీనిపై చర్చించేందుకు ప్రెస్‌క్లబ్ వస్తానని మొదట మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ఆ తర్వాత మేమే రావాలంటూ షరతులు పెట్టారు. మేము అక్కడకు వెళ్లేందుకు సిద్ధమైతే పోలీసులు అడ్డుకున్నారు. గన్‌పార్క్‌కు కూడా రానివ్వలేదు’’ అని మండిపడ్డారు.
అవినీతి చేసినందుకే..
గన్‌పార్క్ వద్దకు వెళ్లే క్రమంలో మంత్రులు అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్‌లకు ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తలేదని హరీశ్ అన్నారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా లేదని, అవినీతి చేసింది కనుకే పోలీసులను అడ్డుపెట్టుకుని తప్పించుకున్నదని ఆరోపించారు. అడ్లూరి లక్ష్మణ్ పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2017లో చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు జీవో తీసుకొచ్చిందని చెప్పారు.
పోలీసు, పాఠశాల, గురుకుల యూనిఫామ్ ఆర్డర్లు టెస్కోకే ఇవ్వాలనే నిబంధన ఉండేని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిబంధనలను ఉల్లంఘించి పెద్ద కాంట్రాక్టర్లకు టెండర్లు ఇచ్చిందన్నారు. దీనిపై కోర్టుకు వెళ్తే చేనేత కార్మికుల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని ఆర్డర్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిందని చెప్పారు. అయినా ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. రేవంత్ రెడ్డికి గుజరాత్ దళారులపై ఉన్న దయ... చేనేత కార్మికులపై లేదన్నారు.
లిడ్ క్యాప్ ద్వారానే బూట్లు కొనాలి
2022లో తెచ్చిన జీవో 110 ప్రకారం.. బూట్ల కొనుగోళ్లను లిడ్‌క్యాప్ ద్వారా చేపట్టాలని హరీశ్ అన్నారు. కానీ, ఇప్పుడు ఒక శాఖ.. మరో శాఖపై కోర్టుకు వెళ్లే పరిస్థితి వచ్చిందని, ఇదే స్కాంకు నిదర్శనమని అన్నారు. ఆర్డర్లు తమకే ఇవ్వాలని లిడ్‌క్యాప్ మంత్రి శ్రీధర్ బాబు, పీఎంయూ చైర్మన్‌కు లేఖలు రాసిందని, కానీ, వాళ్లు పట్టించుకోలేదని విమర్శించారు. చివరకు దళిత బిడ్డలు హైకోర్టుకు వెళ్తే.. 10 శాతం ఆర్డర్లు ఇచ్చారన్నారు.
బీఆర్ఎస్ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ మంత్రులు పిలిస్తేనే హరీశ్ గన్‌పార్క్ వద్దకు బయలుదేరారని, అయినా ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. సవాల్ విసిరిన మంత్రులు పారిపోయారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ హరీశ్ రావు ఫోన్ చేసినా కూడా మంత్రులు ఎందుకు లిఫ్ట్ చేయలేదని ప్రశ్నించారు.
