అరిగిపోయిన రికార్డులా అగ్గిపెట్టె ముచ్చట: హరీశ్ రావు

అరిగిపోయిన రికార్డులా అగ్గిపెట్టె ముచ్చట: హరీశ్ రావు
  •     విమర్శలను మీ విజ్ఞతకే వదిలేస్త: మాజీ మంత్రి హరీశ్​రావు

హైదరాబాద్, వెలుగు : తనపై సీఎం రేవంత్​రెడ్డి అరిగిపోయిన గ్రామ్​ఫోన్​ రికార్డులా అగ్గిపెట్టె ముచ్చట చెప్తున్నారని.. తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్లకు వాస్తవాలు ఏంటో తెలుస్తయని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్​తనపై చేసిన కామెంట్లపై హరీశ్ స్పందించారు. ‘‘ఉద్యమం చేసినోళ్లా.. అమరుల కుటుంబాలను పరామర్శించినోళ్లా.. వాళ్ల పాడె మోసినోళ్లా.. ఉద్యమకారులపైకి తుపాకులతో పోయినోళ్లకు తెలంగాణ పోరాటం.. అమరవీరుల గురించి తెలుస్తదని అనుకోను.. ఇక అరిగిపోయిన గ్రామ్​ఫోన్​రికార్డులా అగ్గిపెట్టె ముచ్చట మాట్లాడటం బంద్​చేయండి.. నన్ను కించపరిచి రాజకీయంగా విమర్శిస్తం అంటే అది మీ విజ్ఞతకే వదిలేస్త” అని అన్నారు. సీఎం రేవంత్ వ్యంగ్యం తగ్గించుకొని.. వ్యవహారం నేర్చుకోవాలన్నారు.

ఒకటో తేదీన జీతాలు ఇవ్వలే

ఎస్ఎల్బీసీ టన్నెల్ విషయంలో సీఎం సభను తప్పుదోవ పట్టించారని హరీశ్​రావు అన్నారు. తమ ప్రభుత్వంలో ఒక్క కి.మీ. మాత్రమే తవ్వామని చెప్తున్నారని, తాము 11 కి.మీ.ల దూరం టన్నెల్​తవ్వామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని గంటల ముందు ఏపీ పోలీసులు నాగార్జున సాగర్​ను ఆక్రమించారని, ఎన్నికల సమయంలో అధికారులు ఎలక్షన్ కమిషన్​ఆధ్వర్యంలో పని చేస్తారని, అప్పుడు ప్రభుత్వం ఉన్నా నామమాత్ర పాత్రే ఉంటుందని తెలిపారు. కేఆర్​ఎంబీకి తాము బడ్జెట్​లో రూ.200 కోట్లు కేటాయించామని, ప్రాజెక్టులు అప్పగించేందుకు పెట్టిన షరతులను కేంద్రం అమలు చేయలేదు కాబట్టి ప్రాజెక్టులు అప్పగించలేదన్నారు. కేంద్రం జారీ చేసిన అధికారిక మినిట్స్​లోని అంశాలను మాత్రమే తాను చెప్తున్నానని తెలిపారు. ప్రభుత్వం ఒకటో తేదీన జీతాలు ఇచ్చిందని సభలో సీఎం అబద్ధాలు చెప్పారని, ఆరు, ఏడో తేదీ వరకు జీతాలు ఇచ్చారని తెలిపారు. ఇప్పటికీ కాంట్రాక్టు, ఔట్​సోర్సింగ్​ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని తెలిపారు. జనవరి నెలలో ఒక్కరికి కూడా పింఛన్​ ఇవ్వలేదని, ఆ పింఛన్​లు ఇప్పుడు లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తున్నారని తెలిపారు.