
రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలలో ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. గతంలో ఉన్న 3 డయాలసిస్ సెంటర్లను.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 102కు పెంచామని మంత్రి చెప్పారు. మంత్రి హరీష్ రావు ఇవాళ సిద్ధిపేట జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా హుస్నాబాద్ లో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల హాస్పిటల్ గా మార్చామన్నారు. 85 లక్షలతో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు. రాజకీయాల కోసం కాకుండా.. రైతుల కోసం ఆలోచించి ప్రాజెక్టుల పనులను అడ్డుకోవద్దని మంత్రి కోరారు.
అనంతరం కొహెడ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో మంత్రి హరీష్ రావు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. బస్వాపూర్ లో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు కృషి చేసిన అంబేద్కర్ సంఘాలకు, గ్రామస్తులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడని.. ఒక దళితులు మాత్రమే ఆరాధిస్తారనొద్దు అన్నారు. అలా అనుకోవడానికి వీల్లేదని.. దేశంలో అన్ని కులాలు, మతాలు కలిసి మెలిసి ఉండడానికి నాడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే అని వ్యాఖ్యానించారు.