- ఉత్పత్తి చేతగాక ప్రైవేటు నుంచి కొనుగోళ్లు
- చార్జీల పెంపును ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడ్తం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం దసరా, దీపావళి పండుగల వేళ శుభవార్త చెప్పాల్సింది పోయి..ట్రూ అప్ చార్జీల పేరుతో ఏకంగా రూ.5,420 కోట్ల భారాన్ని ప్రజల నెత్తిన పిడుగులా వేసిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు బిల్లుల వాతలుగా మారిందన్నారు.
ప్రభుత్వ అసమర్థత, నిర్వహణ లోపాలకు వినియోగదారులను బలి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘‘రూ.5,420 కోట్ల భారాన్ని వినియోగదారులపై మోపే హక్కు సీఎం రేవంత్‌కు ఎవరిచ్చారు? విద్యుత్ కొనుగోళ్లకు ప్రభుత్వం చేసిన ఖర్చును ప్రజల ముక్కుపిండి వసూలు చేయాలనుకోవడం ఎంతవరకు సమంజసం? ఇది ప్రజాపాలన కాదు.. ప్రజా పీడన’’ అని అన్నారు.
ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని, ఆ భారాన్ని ప్రభుత్వమే భరించాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా భారీ పోరాటం చేస్తామని హెచ్చరించారు. 2016–17 నుంచి 2021–22 వరకు ట్రూ అప్ చార్జీల రూపంలో రూ.12,718.40 కోట్లు వేయాలని ఈఆర్సీ ప్రతిపాదించినా.. కేసీఆర్ నయాపైసా భారం కూడా ప్రజలపై మోపనీయలేదని తెలిపారు. విద్యుత్ సంస్థల నష్టాలను ప్రభుత్వమే భరించింది కానీ ప్రజల జోలికి వెళ్లలేదని చెప్పారు.
రాష్ట్రంలో ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో 13,384 మెగావాట్ల థర్మల్ సామర్థ్యం ఉంటే, కనీసం 8 వేల మెగావాట్లు కూడా ఉత్పత్తి చేయడం లేదన్నారు. దాదాపు 45 శాతం గ్యాప్ ఉందని, యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తి సామర్థ్యం 96 మిలియన్ యూనిట్లు (ఎంయూ) అయితే, 39 ఎంయూలు కూడా ఉత్పత్తి కావడం లేదన్నారు.
డిస్కమ్‌లను ప్రైవేటీకరించే కుట్ర
సింగరేణిలో రూ.1,600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు మాయమయ్యాయని, దీనిపై ఆధారాలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదని హరీశ్‌రావు ఆరోపించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసినా చర్యలు తీసుకోలేదన్నారు. స్థానికంగా నైనీ బొగ్గు అందుబాటులో ఉన్నా, అధిక ధరలకు విదేశీ బొగ్గును దిగుమతి చేసుకునేందుకు కుట్రలు చేస్తున్నారని చెప్పారు. టీజీ -ట్రాన్స్‌కోలో 26 శాతం వాటాలను ప్రైవేటుపరం చేసేందుకు రంగం సిద్ధం చేశారని ఆరోపించారు.
