- తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీనే
- పాలమూరు– రంగారెడ్డికి మరణశాసనం రాసింది వారే
- కృష్ణా జలాలను ఏపీకి అప్పగించిందే కాంగ్రెస్
- మేడిగడ్డ రెండు పిల్లర్లు కుంగితే కాళేశ్వరం మొత్తాన్ని పండబెట్టిన్రు
- రూ.200 కోట్లు పెడితే 56 లక్షల ఎకరాలకు నీళ్లు.. కానీ రూ.2 కూడా ఖర్చు పెట్టలే
- 2009లోనే కాంగ్రెస్ హయాంలో పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ 1.10 లక్షల క్యూసెక్కులు తీసుకెళ్లిందని ఆరోపణ
- ‘నదీ జలాలు – కాంగ్రెస్ ద్రోహాలు’ పేరిట పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
హైదరాబాద్, వెలుగు: కృష్ణా నీళ్లపై అసెంబ్లీ సాక్షిగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిఉత్త కథలు, సీఎం రేవంత్‌రెడ్డి పిట్టకథలు చెప్పారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణకు నంబర్‌వన్ విలన్ కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. ఫజల్ అలీ కమిషన్ వద్దన్నా.. తెలంగాణను ఆంధ్రాలో కలిపి ద్రోహం చేసిందే ఆ పార్టీ అని విమర్శించారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు మరణశాసనం రాసింది వారేనని అన్నారు. రాష్ట్రానికి కాంగ్రెస్ చేసిన ద్రోహాలను కప్పిపుచ్చారని ఆరోపించారు. విభజన సమయంలోనూ తీవ్ర అన్యాయం చేసింది ఆ పార్టీనేనని ఆరోపించారు.
పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసిందని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్ తెలంగాణభవన్‌లో ‘నదీ జలాలు– కాంగ్రెస్ ద్రోహాలు’ అంశంపై హరీశ్‌రావు పవర్పాయింట్ప్రజెంటేషన్ఇచ్చారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మరో రెండేండ్లలో కృష్ణా ప్రాజెక్టులను రేవంత్ కృష్ణా బోర్డుకు అప్పగిస్తారని, కృష్ణా జలాలను అతి తక్కువగా వినియోగిస్తారని పేర్కొన్నారు. గోదావరి –బనకచర్ల ప్రాజెక్టుకు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరంపై కక్షగట్టి.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై పగబట్టారని అన్నారు. అసెంబ్లీ మొత్తాన్ని సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలతో తప్పుదోవ పట్టించారన్నారు. ‘‘రేవంత్.. అబద్ధాలు చెప్పినందుకు నీ నాలుక కోయాలా? ఎవరి నాలుక కోయాలో చెప్పు? చీము, నెత్తురు ఉన్నోడైతే రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా చేయాలి. దేవుళ్లను మోసం చేసిన ఘనుడు రేవంత్‌రెడ్డి. నేను ఇలా మాట్లాడుతున్నందుకు నాపై దాడి చేయించొచ్చు. లేదా హత్యాయత్నమూ చేయించొచ్చు’’ అని హరీశ్ వ్యాఖ్యానించారు.
అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారు..
నిపుణుల సలహాలు, సూచనలతోనే పాలమూరు– రంగారెడ్డి, కాళేశ్వరం– ప్రాజెక్టులకు కేసీఆర్ రూపకల్పన చేశారని హరీశ్‌రావు తెలిపారు. రెండు పిల్లర్లు కుంగితే కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పండబెట్టిందని విమర్శించారు. రూ.100 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు ఖర్చు పెడితే 56 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కానీ, ఈ రెండేండ్లలో రెండు రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ లేకపోయినా.. నదీప్రవాహం నుంచి కన్నెపల్లి పంప్‌హౌస్‌ను నడిపి నీటిని ఎత్తిపోసుకునేందుకు అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రం మేలు కోసం పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్టును కడితే.. రెండేండ్లుగా ప్యాకేజ్–3లోని ఓ చిన్న కాల్వను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. ఆ కాల్వను పూర్తి చేస్తే 50 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం ఉంటుందన్నారు. కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో కొత్తగా 17 లక్షల ఎకరాల ఆయకట్టు సృష్టించారని, స్థిరీకరణ ద్వారా మరో 31.51 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని, మొత్తంగా 48.74 లక్షల ఎకరాల ఆయకట్టును సృష్టించామని హరీశ్‌రావు తెలిపారు. అదే ఉమ్మడి ఏపీలో 2004 వరకు 36 లక్షల ఎకరాల ఆయకట్టే ఉండేదని, ఆ తర్వాత పదేండ్లలో మరో 5.71 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టునే సృష్టించామని గుర్తు చేశారు. స్టెబిలైజేషన్ మరో 93 వేల ఎకరాలని చెప్పారు. మొత్తంగా కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు కలిసి 60 ఏండ్లలో ఇచ్చింది 42 లక్షల ఎకరాలేనని తెలిపారు. కానీ, అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు.
కాంగ్రెస్ హయాంలోనే 3 డీపీఆర్లు వెనక్కొచ్చినయ్
ఉమ్మడి రాష్ట్రంలో 490 టీఎంసీల ప్రాజెక్టులకు అనుమతులు వచ్చాయని రేవంత్ పచ్చి అబద్ధం చెప్పారని హరీశ్‌రావు విమర్శించారు. 191 టీఎంసీల ప్రాజెక్టులే ఉన్నాయన్నారు. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల్లో 299 టీఎంసీలు నికరజలాలని చెప్పారు. గోదావరి నదిలో నిజాం టైంలో తెలంగాణకు దక్కింది 252 టీఎంసీలని తెలిపారు. 60 ఏండ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో గోదావరిపై కేవలం 265 టీఎంసీల జలాలకే హక్కులు వచ్చాయని, అదే కేసీఆర్ ప్రభుత్వం 383 టీఎంసీలకు హక్కులు సాధించిందని చెప్పారు. కృష్ణా జలాల వాటాలు తేల్చేందుకు ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్‌లోనే కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశామన్నారు. పాలమూరు, డిండి ప్రాజెక్టులను కొనసాగిస్తామని కేసీఆర్ చెప్పారన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక 11 ప్రాజెక్టులకు డీపీఆర్‌లను పంపామన్నారు. 7 ప్రాజెక్టులకు అనుమతులు సాధించామని చెప్పారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు, అంబేద్కర్ వార్దా, కాళేశ్వరం అడిషనల్ టీఎంసీల డీపీఆర్‌లు వెనక్కు వచ్చాయన్నారు. ఒక్క క్లియరెన్స్ కూడా తేలేదన్నారు. బీఆర్‌ఎస్ సక్సెస్ రేట్ 63 శాతమైతే.. కాంగ్రెస్ సక్సెస్ రేట్30 శాతమేనన్నారు. టెలిమెట్రీలను పెట్టాలనీ 2016 లోనే కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. ఇవన్నీ దాచిపెట్టి.. సగంసగం పేరాలు మాత్రమే రేవంత్ చదివారన్నారు.
ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంలో శవాలనూ బయటకు తీసుకురాలే
రాష్ట్రానికి ఎస్‌ఎల్‌బీసీ రూపంలో కాంగ్రెస్ మరో ద్రోహం చేసిందని హరీశ్‌రావు అన్నారు. దీనిపై మంత్రి ఉత్తమ్ ఉద్దెర మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏడేండ్లలో 11.50 కిలోమీటర్ల మేర టన్నెల్‌ను తవ్వామని చెప్పారు. టన్నెల్ తవ్వకానికే రూ.1,358 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. టన్నెల్ పూర్తి చేసి డిండి, పెండ్లిపాక రిజర్వాయర్లకు నీటిని తరలించే ప్రణాళికలుండేవన్నారు. ఆ రెండు రిజర్వాయర్ల కోసం రూ.3,892 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండేండ్లలో తవ్వింది కేవలం 18 మీటర్లేనని చెప్పారు. కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో పెద్దవాగు కొట్టుకుపోయిందని, వట్టెం పంప్‌హౌస్ మునిగిపోయిందని, ఎస్‌ఎల్‌బీసీ కుప్పకూలిందని ఆరోపించారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంలో కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం శవాలను కూడా బయటకు తీసుకురాలేకపోయిందన్నారు. చెక్‌డ్యాములు పేల్చుడు.. ప్రాజెక్టులు కూల్చుడు..మునగ్గొట్టుడు ఇదే కాంగ్రెస్ చేసిందని ఎద్దేవా చేశారు.
మేం సెక్షన్ 3 సాధిస్తేనే వాదనలు జరుగుతున్నయ్
కాంగ్రెస్, టీడీపీ ద్రోహం వల్లే తెలంగాణకు కేవలం 299 టీఎంసీల నీళ్లొచ్చాయని హరీశ్‌రావు చెప్పారు. పోతిరెడ్డిపాడుపై ఏపీ ప్రభుత్వాలను కేసీఆర్ ప్రశ్నించారన్నారు. విస్తరణను ఆపకపోతే.. ఆలంపూర్దగ్గర ప్రాజెక్టు కడతామని హెచ్చరించారని గుర్తు చేశారన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా బీఆర్ఎస్ హయాంలో ఎస్ఆర్ఎంసీ లైనింగ్ పనులు జరిగాయంటూ.. 92 వేల క్యూసెక్కులు తీసుకెళ్లేలా ఏపీ సామర్థ్యం పెంచుకున్నదంటూ కాంగ్రెస్ చెప్పిన మాటలు పచ్చి అబద్ధాలు అని పేర్కొన్నారు. అసలు 2009లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే.. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ 1.10 లక్షల క్యూసెక్కుల నీటిని తరలించుకెళ్లిందన్నారు. కృష్ణాలో సగం వాటా కావాలని కేంద్రానికి తాము 28 లేఖలు రాశామని చెప్పారు. కేంద్రంపై తాము పోరాడి సెక్షన్ 3ని సాధిస్తేనే ఇప్పుడు నీటి వాటాలపై ట్రిబ్యునల్‌లో వాదనలు జరుగుతున్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రం లో తెలంగాణకు నికరజలాలు కేటాయించకపోవడం వల్లే అన్యాయం జరిగిందన్నారు. కల్వకుర్తి, నెట్టెం పాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేసేందుకు కసరత్తులు జరిగాయని చెప్పారు.
