హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ సీట్లలో బీసీకి ఒకటి, ఎస్సీ, ఎస్టీలకు మరొకటి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఈ అంశంపై శనివారం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాశారు. దేశవ్యాప్తంగా కులగణన జరగాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేయడంతో కేంద్రం దిగొచ్చి జనగణనలో కుల గణన చేస్తామని అంగీకరించిందని పేర్కొన్నారు. “ కులగణన ఆధారంగా వాటా దక్కాలన్న మీ మాటలు దేశంలోని 90 కోట్ల మంది బహుజనులకు స్ఫూర్తినిచ్చాయి.
ముఖ్యంగా తెలంగాణలో సామాజిక న్యాయం దిశగా నిర్ణయం తీసుకోవాలని యావత్ బీసీ సమాజం తరుపున కోరుతున్నా. సామాజిక న్యాయం అమలే దేశంలో కాంగ్రెస్ పార్టీని అగ్ర భాగాన నిలబెడుతుంది. ప్రస్తుతం మార్చి నెలలో భర్తీ చేయబోయే రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకటి బీసీలకు.. ఇంకొకటి ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం” అని రాహుల్‌గాంధీని శ్రీనివాస్‌గౌడ్ కోరారు.
