- ఆయన తిరిగి చర్చలు జరపలేరు..మళ్లీ లొంగిపోతారని కామెంట్
న్యూఢిల్లీ: భారత్-–అమెరికా వాణిజ్య ఒప్పందం, తాజాగా అమెరికా విధిస్తున్న టారిఫ్‌ల అంశంలో కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. అమెరికాతో ట్రేడ్ డీల్ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ రాజీపడ్డారని ఆరోపించారు. శనివారం ‘ఎక్స్’లో విమర్శలు గుప్పించారు. ‘‘ప్రధాని రాజీపడ్డారు. ఆయన చేసిన ద్రోహం ఇప్పుడు బయటపడింది. ఆయన తిరిగి చర్చలు జరపలేరు. ఆయన మళ్లీ సరెండర్ అవుతారు” అని వ్యాఖ్యానించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ ప్లాన్లకు అక్కడి సుప్రీంకోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. శుక్రవారం కూడా రాహుల్ గాంధీ.. భారత్-–అమెరికా వాణిజ్య ఒప్పందంపై విమర్శలు చేశారు. ఈ ట్రేడ్ డీల్ విషయంలో మోదీ తీరును ప్రస్తావిస్తూ.. ‘జియు-జిట్సు’ మార్షల్ ఆర్ట్స్ పోలికను ఉపయోగించారు. ప్రధాని ఇప్పుడు ఒక అదృశ్యమైన రాజకీయ ఉచ్చులో చిక్కుకున్నారని, బయటకు కనిపించని కొన్ని పట్టులు ఆయనను కదలనివ్వట్లేదని, అందుకే భారత్‌పై ట్రంప్ సుంకాలు విధిస్తున్నా, మన ప్రయోజనాలను కాపాడటంలో మోదీ విఫలమవుతున్నారని వ్యాఖ్యానించారు.
మహారాష్ట్ర కోర్టుకు హాజరైన రాహుల్‌గాంధీ
ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త దాఖలు చేసిన 2014 పరువు నష్టం కేసులో.. కొత్త ష్యూరిటీ సమర్పించేందుకు రాహుల్ గాంధీ శనివారం మహారాష్ట్రలోని భీవండి మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ హర్షవర్ధన్ సపకాల్‌ను తన కొత్త గ్యారంటీర్‌గా పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు హామీదారుగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ నిరుడు డిసెంబర్ 12న మరణించారు.
దీంతో ఆయన స్థానంలో కొత్త గ్యారంటర్ పేరును నమోదు చేయాల్సిందిగా న్యాయస్థానం రాహుల్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. మహాత్మా గాంధీ హత్య వెనుక ఆర్‌ఎస్‌ఎస్ హస్తం ఉందంటూ గతంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త రాజేశ్ కుంటే ఈ కేసు వేశారు.
రాహుల్ చేసిన వ్యాఖ్యలు సంఘ్ ప్రతిష్టను మసకబార్చాయని, అది సెక్షన్ 500 కింద నేరమని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ఏఐ సమిట్‌లో యూత్ కాంగ్రెస్ చర్యను నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు, యువజన విభాగం సభ్యులు ఢిల్లీ, సూరత్, ములుండ్ (మహారాష్ట్ర), హైదరాబాద్ సహా పలు నగరాల్లో భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు.
