బనకచర్లపై ఎందుకు కొట్లాడ్తలే? ఏపీ ముందుకు పోతుంటే సీఎం ఏం చేస్తున్నరు? : హరీశ్రావు

బనకచర్లపై ఎందుకు కొట్లాడ్తలే? ఏపీ ముందుకు పోతుంటే సీఎం ఏం చేస్తున్నరు? : హరీశ్రావు
  • టెక్నో ఎకనామికల్​ అప్రైజల్​ ప్రాసెస్​లో ఉందని 20 రోజుల కిందట్నే కేంద్రం లేఖ రాసింది
  • బీఆర్​ఎస్​ తరఫున సుప్రీంకోర్టుకు వెళ్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఏపీ చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణ పాలిట పెను ప్రమాదంగా మారబోతున్నదని బీఆర్​ఎస్  ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్​ రావు అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ సహకారంతో ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న అడ్డంకులను ఏపీ తొలగించుకుంటూ ముందుకెళ్తున్నదని, అయినా రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్​ రెడ్డి మాత్రం స్పందించడం లేదని మండిపడ్డారు.

 ‘‘ప్రాజెక్టు నిర్మాణానికి శరవేగంగా ఏపీ అడుగులు వేస్తున్నా సీఎం రేవంత్​రెడ్డి ఎందుకు స్పందించడం లేదు? బనకచర్ల ప్రాజెక్టు పీఎఫ్​ఆర్​ టెక్నో ఎకనామికల్​ అప్రైజల్​ ప్రక్రియ ప్రోగ్రెస్​లో ఉందని, దానిని ప్రాసెస్​ చేస్తున్నామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్​ పాటిల్​.. సీఎం రేవంత్​కు సెప్టెంబర్​ 23న లేఖ రాశారు. ఆ లెటర్​ వచ్చి 20 రోజులవుతున్నా.. సీఎం దానిని వ్యతిరేకించాల్సిందిపోయి మౌనంగా ఉండిపోయారు. కమీషన్ల కోసమే బనకచర్ల ప్రాజెక్టుపై మౌనంగా ఉంటున్నారా? రాష్ట్ర ప్రయోజనాలు కాపాడకుండా మీ స్వార్థం చూసుకుంటారా? ఎందుకు మౌనంగా ఉంటున్నారు?” అని ఆయన ప్రశ్నించారు. 

శనివారం తెలంగాణ భవన్​లో మీడియాతో హరీశ్​రావు మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్టును ఏపీ నిర్మిస్తే.. ఆ రాష్ట్రం తరలించే 423 టీఎంసీల్లో 112 టీఎంసీలను కృష్ణాలో వాడుకుంటామని కర్నాటక చెప్తున్నదని  అన్నారు. ఇటు మహారాష్ట్ర కూడా 74 టీఎంసీలు తీసుకుంటామంటున్నదని, గోదావరిలోనూ ప్రాజెక్టు కట్టి విదర్భకు నీటిని తీసుకెళ్తామని చెప్తున్నదని పేర్కొన్నారు. 

మొత్తంగా గోదావరి నీళ్లు ఏపీకి, కృష్ణా నీళ్లు మహారాష్ట్ర, కర్ణాటకకు వెళ్తాయని..దీని వల్ల తెలంగాణకు తీరని నష్టం జరగదా అని ప్రశ్నించారు. తెలంగాణ పరిస్థితి శాండ్​విచ్​లా మారిందని వ్యాఖ్యానించారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కర్నాటక, మహారాష్ట్ర అంత స్పష్టంగా ముందుకెళ్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర పోతున్నదని ఆయన ఆరోపించారు. 

బీజేపీది రాష్ట్రానికో నీతి 

ప్రాజెక్టు డీపీఆర్​ కోసం ఏపీ ఇప్పటికే టెండర్లను పిలిచిందని, ఇంత జరుగుతున్నా రేవంత్​ మౌనంగా ఉంటున్నారని హరీశ్​ రావు విమర్శించారు. పోలవరం కుడి కాల్వ ద్వారా 23 వేల క్యూసెక్కులను బనకచర్ల లింక్​ కోసం తరలిస్తామని టెండర్​లో ఏపీ ప్రభుత్వం పేర్కొన్నదని చెప్పారు. వాస్తవానికి పోలవరం కుడి కాల్వ కెపాసిటీ 11,500 క్యూసెక్కులేనన్నారు. నిబంధనలు ఉల్లంఘించి కాల్వ కెపాసిటీ పెంచుతుంటే కేంద్రం ఏం చేస్తున్నదని ఆయన ప్రశ్నించారు. 

‘‘బీజేపీకి రాష్ట్రానికో నీతి ఉంటుందా? ప్రాజెక్టును ఆపాల్సిన కేంద్ర మంత్రులు కిషన్​ రెడ్డి, బండి సంజయ్​ ఏం చేస్తున్నరు? ” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉన్నా.. కేసీఆర్​ మాత్రం లాయర్లతో మాట్లాడుతూనే ఉన్నారని హరీశ్​ తెలిపారు. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లకున్నా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీఆర్​ఎస్​ సుప్రీంకోర్టుకు వెళ్తుందన్నారు.